ఎల్లుండి నుంచి ఇసుక వారోత్సవాలు జరపాలి: సీఎం జగన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 9:21 AM GMT
ఎల్లుండి నుంచి ఇసుక వారోత్సవాలు జరపాలి: సీఎం జగన్‌

అమరావతి: నవంబర్‌ 14 నుంచి 21 వరకూ ఇసుక వారోత్సవాలు జరపాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌ 80 వేల టన్నులు.. వరదల కారణంగా రీచ్‌లు మునిగిపోవడంతో ఈ డిమాండ్‌ను చేరుకోలేకపోయామన్నారు. గత వారం రోజులుగా ఈ పరిస్థితి మెరుగుపడిందన్నారు. 1.20 లక్షల టన్నులకు ఇసుక సరఫరా రోజువారీ పెరిగిందని చెప్పారు.

రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కిపైగా చేరింది. 1.2 లక్షల టన్నులను 2 లక్షల టన్నుల వరకూ వచ్చే వారం రోజుల్లో పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 137 నుంచి 180 వరకు స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఇసుక రేటు కార్డును ప్రకటించాలి. రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్‌ చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్లను ఇన్‌ఛార్జిలుగా పెట్టాం, వారు స్టాక్‌ పాయింట్లను పూర్తిగా పెంచాలని సూచించారు. ఎవరైనా ఎక్కువ అమ్మితే పెనాల్టీయే కాదు, సీజ్‌ చేయడమే కాదు, రెండేళ్ల వరకూ జైలుశిక్ష.. దీనికి రేపు కేబినెట్‌ ఆమోదం కూడా తీసుకుంటామని సీఎం జగన్‌ తెలిపారు.

జిల్లాల వారీగా రేటు కార్డులను ప్రచారం చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఇసుక కొరత తీరేవరకూ ఎవరూ కూడా సెలవులు తీసుకోకుండా పని చేయాలన్నారు. సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్న రూట్లు, పెద్ద రూట్లలో చెక్‌ పోస్టులు పెట్టి.. వీడియో కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి కావాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌ అండ్‌ బి, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. అక్రమ రవాణా, ప్రకటించిన ధరలకు మించి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Next Story