మహారాష్ట్రలో సీఎం 'సీటు' ఫైట్

By Medi Samrat  Published on  26 Oct 2019 10:25 AM GMT
మహారాష్ట్రలో సీఎం సీటు ఫైట్

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు. ప్రభుత్వాన్ని ఎవరూ ఏర్పాటు చేస్తారు. ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది సభ్యుల సంఖ్యా బలం కావాలి. 105 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ కాలేకపోయింది.

నిజానికి గత ఎన్నికల్లో 122 సీట్లు గెలిచిన బీజేపీ ఈ సారి కూటమి ఒప్పందంలో భాగంగా శివసేనతో కలిసి పోటీ చేసింది. 152 సీట్లలో పోటీ చేసి 105 సీట్లు మాత్రమే దక్కించుకుంది. 2014 ఎన్నికలతో పోల్చితే దాదాపు 17 సీట్లను కోల్పోయింది. గత ఎన్నికల్లో 63 సీట్లను దక్కించుకున్న శివసేన ఈ సారి ఏడు సీట్లను కోల్పోయింది. బీజేపీతో కూటమి ఒప్పందంలో భాగంగా 124 సీట్లలో పోటీ చేసిన ఉద్దవ్ ఠాక్రేసేన కేవలం 56 సీట్లను మాత్రమే దక్కించుకుంది.

54 సీట్లతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. యూపీఏ కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో కలిసి ఎన్‌సీపీ పోటీ చేసింది. 123 సీట్లలో పోటీ చేసిన శరద్ పవార్ టీం.. గతం కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. 13 సీట్లు పెంచుకుని 54 స్థానాలను దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 145 సీట్లలో పోటీ చేసి గతం కంటే రెండు స్థానాలు ఎగబాకి 44 సీట్లను సొంతం చేసుకుంది. ఈ రెండు పార్టీల సంఖ్యాబలం 100 సీట్లు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వీళ్లకు ఇంకా 45 సీట్లు కావాలి.

ఇదిలావుంటే.. శివసేనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ఇప్పటికే యూపీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న ఎన్‌సీపీ స్పష్టం చేసింది. బీజేపీకి అధికారం దక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ కూడా శివసేనకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఎన్‌సీపీ ఆఫర్ ను శివసేన అంగీకరిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టే. కూటమిలో శివసేన 56 సీట్లతో, ఎన్‌సీపీ 54 సీట్లతో, 44 సీట్లతో కాంగ్రెస్ మొత్తం కలుపుకుంటే సంఖ్యాబలం 156 సీట్లకు పెరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది కేవలం 145 సీట్లు మాత్రమే. కానీ యూపీఏ కూటమి ఆఫర్ ను శివసేన తీసుకునే ఛాన్స్ లేదు.

ఇక‌పోతే.. 56 సీట్లతో రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచిన శివసేన ఇప్పుడు సీఎం పీఠంపై కన్నేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తాము తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఠాక్రే సేన అంటోంది. అందుకే తాము చెప్పినట్టుగా సీఎం పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. బీజేపీతో పోల్చుకుంటే తామే బలపడ్డామని చెప్పుకొస్తుంది. తాము కేవలం 7 సీట్లు కోల్పోతే బీజేపీ ఏకంగా గతంలో పోల్చుకుంటే 17 సీట్లను కోల్పోయిందని సమర్ధించుకుంటున్నాయి శివసేన శ్రేణులు.

వర్లీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన శివసేన వారసుడు ఆదిత్యా ఠాక్రేకు రెండున్నరేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తోంది శివసేన. ఇప్పటికే భావి మహారాష్ట్ర సీఎం అంటూ ముంబైలోనే కాక పలు చోట్ల ఆదిత్యా ఠాక్రే ఫ్లెక్సీలు వెలిశాయి. శివసేన అధికారిక పత్రిక సామ్నా ప్రధాన సంపాదకుడు సంజయ్ రౌత్.. చెరో సగం డిమాండ్ ను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అవసరమైతే ఎన్‌సీపీతో కూడా జత కట్టేందుకు వెనుకాడమనే సంకేతాలు పంపుతున్నారు. అయితే శివసేన డిమాండ్లపై బీజేపీ ఎలా స్పందించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఫడ్నవిస్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని.. మరో 24 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమేనని ఫడ్నవిస్ చెప్పుకొస్తున్నారు. శివసేనకు రెండున్నరేళ్లు సీఎం పీఠం కట్టబెట్టాలని యోచన బీజేపీకి లేదనిపిస్తోంది. అవసరమైతే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు కీలక మంత్రి పదవులను ఇచ్చి.. తానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఫడ్నవిస్ యోచన చేస్తున్నారు. కేంద్ర బీజేపీ అధిష్టాణం కూడా ఇదే యోచనతో ఉన్నట్టు సమాచారం.

బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే శివసేన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. రెబల్స్, ఇతరులు ఉన్నా వారందర్నీ ఒక తాటిపైకి తీసుకురావడం కష్టమే. ఇలాంటి తరుణంలో మరీ తప్పదనకుంటే శివసేనకు ఒక ఏడాది సీఎం పదవి.. కుదరనుకుంటే.. అతి కష్టంగానే రెండున్నరేళ్లు సీఎం సీటును ఆఫర్ చెయ్యాలని చూస్తున్నట్టు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహాపీఠాన్ని ఎవరు దక్కించుకుంటారు అనేది ప్రతిఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Next Story