తెలంగాణకు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కేజ్రీవాల్
By సుభాష్
గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో తెలంగాణ అతలకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముఖ్యంగా హైదరాబాద్ నగరమంతా నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి జల దిగ్బంధమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా బాగా సంభవించింది. ఇప్పటికి చాలా ఇళ్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అంటున్న వాతావరణ శాఖ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.
ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించగా.. ఇప్పుడు భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన తెలంగాణలో సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుపున రూ.15 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తి అండగా ఉంటుందని వెల్లడించారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ కు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్‌లో వరదలకు నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వరదలకు దెబ్బతిన్న కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం ప్రకటించారు. అలాగే వర్షానికి పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్నవాటికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటిచారు. ఈ సాయాన్ని కూడా తక్షణమే అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.