మరోసారి ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 5:17 AM GMT
మరోసారి ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..!

ముఖ్యాంశాలు

  • 37వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • నేడు మరోసారి ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరుకుంది. శనివారం రోజున ట్యాంక్‌ బండ్‌పై కార్మికులు మిలియన్‌ మార్చ్ నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తమ డిమాండ్లను సాధించే వరకూ సమ్మెను ఆపేది లేదని కార్మికులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్మికులపై పోలీసులు లాఠీ చార్జ్‌కు దిగారు. దీంతో వందలాది మంది కార్మికులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులపై కార్మికులు రాళ్లదాడికి దిగారు. పోలీసులు టీయర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. పోలీసులు ఏర్పాటు చేసిన వలయాలను చేధించుకొని కార్మికులు ట్యాంక్‌బండ్‌ వైపు దూసుకొచ్చారు. దాదాపుగా 170 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 48 వేల కార్మికులు గత 36 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు.

మరో వైపు రేపు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనుంది. ఇవాళ మరోసారి ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. రేపు హైకోర్టు విచారణలో వ్యవహరించాల్సిన తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు. రేపు హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలసుస్తోంది.

Next Story