ఆహార భద్రత సాధించినా.. పోషకాహార భద్రత సాధించలేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2020 1:05 PM GMT
ఆహార భద్రత సాధించినా.. పోషకాహార భద్రత సాధించలేదు

మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలను సాగు చేసే అలవాటు రైతుల్లో రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నియంత్రిత విధానంలో రాష్ట్రంలో పంటల సాగు విధానంపై మూడు రోజుల పాటు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, అగ్రో బిజినెస్ కన్సల్టెంట్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సారి వర్షాకాలం పంటలతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. మార్కెట్‌లో అమ్ముడైయ్యే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని తెలిపారు. అంతిమంగా రైతుల లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు.

దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినప్పటికీ.. పోషకాహార భద్రత సాధించలేదని సీఎం కేఆర్‌ అభిప్రాయపడ్డారు. బలవర్థకమైన ఆహారాన్ని ప్రజలు తీసుకోవడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలని అధికరులకు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరగాలన్నారు.

Next Story