ఆ పంట‌లు పండించండి.. రైతుబంధు, గిట్టుబాటు ధ‌ర పొందండి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 May 2020 9:28 AM IST
ఆ పంట‌లు పండించండి.. రైతుబంధు, గిట్టుబాటు ధ‌ర పొందండి

తెలంగాణ‌ రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి.. రైతులంద‌రూ రైతుబంధు సాయం, పండించిన పంటకు గిట్టుబాటు ధ‌ర పొందాల‌న్న‌దే తన అభిమతమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న‌ పంటలు పండిప్తేనే రైతులు మాంచి ధర పొందుతార‌ని ఆయ‌న అన్నారు. ఏ పంట పండించ‌డం ద్వారా రైతుల‌కు ఎక్కువ‌ మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగు చేస్తే రైతుల‌కు ఏ ఇబ్బంది ఉండదని ఆయ‌న అన్నారు.

గురువారం ప్రగతి భవన్‌లో వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో సీఎం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో రాష్ట్ర మంత్రులు, వ్యవసాయాధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా రైతు బంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, సైంటిస్టులు పాల్గొన్నారు.

వారితో ముఖాముఖి అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్ పడిపోయి నష్టపోతున్నారు. ఈ విధానంలో మార్పు తేవాల‌నే ఆలోచ‌న‌తో.. రైతులు ఏ సీజ‌న్‌లో ఏ పంట వేయాలి.. ఏ ర‌కం సాగు చేయాల‌నే విష‌యం శాస్త్ర‌వేత్త‌ల‌తో చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికొచ్చామ‌న్నారు. ఏ పంట వేయ‌డం ద్వారా రైతుల‌కు న‌ష్ట‌ముండ‌దో.. దాని ప్ర‌కారం ప్ర‌భుత్వం రైతుల‌కు త‌గు సూచ‌న‌లు చేస్తుంది అన్నారు.

గత ఏడాది వానాకాలంలో వరి పంట 40 లక్షల ఎకరాల్లో సాగు చేశారని.. ఈ సారి కూడా అంతే విస్తీర్ణంలో సాగు చేయాలని సూచించారు. గడిచిన ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయ‌గా.. ఈ సారి మాత్రం 70 లక్షల ఎకరాలకు పెంచాల‌న్నారు. పోయిన ఏడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయ‌గా.. ఇప్పుడు 15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సూచించారు. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చన్నారు.

ఇక వ‌ర్ష కాలంలో మొక్క‌జొన్న సాగు లాభ‌సాటి కాద‌ని.. యాసంగిలో మ‌క్క‌ల సాగు చేసుకోవాల‌న్నారు. వర్షాకాలంలో మక్కల దిగుబడి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో పండిస్తే 35 క్వింటాళ్ల వరకు వస్తుంది. వర్షాకాలంలో మక్కల సాగు వల్ల కేవలం 25వేల ఆదాయం మాత్రమే వస్తుంది. పత్తి పండిస్తే 50వేల ఆదాయం వస్తుంది. తెలంగాణలో 25 లక్షల టన్నుల మక్కలే కావాల్సి ఉంది. అది యాసంగి పంటతో సమకూరుతుంది. వ‌ర్షా కాలంలో మొక్క జొన్న పంట వేసే వారు వాటికి బ‌దులుగా పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలని సూచించారు. అలాగే.. పచ్చిరొట్టను విరివిగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఇక వ‌రి వంగాడాల విష‌యంలో.. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా వంటి ర‌కాల‌ను పండించాల‌ని సూచించారు.

Next Story