అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారంటే..
By అంజి
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్.. ట్రంప్ దంపతులకు సీఎం కేసీఆర్‌ను పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(GES)కు మీ అతిథ్యం బేష్ అని కేసీఆర్‌ని అభినందించారు.
కేసీఆర్‌కు ట్రంప్ షెక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. జీఈఎస్ గురించి ప్రస్తావించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. జీఈఎస్ సదస్సుకు మీరు హాజరవుతారని భావించామన్నారు. సదస్సుకు ఇవాంక ట్రంప్ వచ్చి అందరినీ ఆకట్టుకుందని ట్రంప్‌కు తెలిపారు. సదస్సుకు తాను రావాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని కేసీఆర్‌కు ట్రంప్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. విందుకు సీఎం కేసీఆర్ సూటు బూటు వేసుకొని హాజరయ్యారు. కేసీఆర్ వెంట ఎంపీ కేశవరావు తదితరులు ఉన్నారు. ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో తొమ్మిది రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఈ విందులో పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
విందు అనంతరం మంగళవారం రాత్రి 10.32 గంటలకు ట్రంప్ దంపతులు అమెరికాకు పయనమయ్యారు. భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగాలని విందులో ట్రంప్ అన్నారు. మొతేరా స్టేడియంలో తనకు లభించిన ఘన స్వాగతాన్ని ట్రంప్ స్మరించుకున్నారు. భారత ప్రజలపై తనకు అపారమైన గౌరవం ఉందని ట్రంప్ అన్నారు. భారత్‌లో గడిపిన రెండు రోజులను తాను ఎప్పటికి మర్చిపోనని చెప్పారు.