సాదా బైనామాలకు ఇదే చివరి అవకాశం : కేసీఆర్
By సుభాష్ Published on 29 Oct 2020 9:56 AM GMTరెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వేదికపై మాట్లాడారు. రాష్ట్రంలో సాదాబైనామాల గడువు మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సాదాబైనామాల ద్వారా క్రయ విక్రయాలు జరిపిన వాళ్లు చివరి అవకాశం వినియోగించుకోవాలని అన్నారు. భవిష్యత్తులో సాదాబైనామాలకు అవకాశం ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. భూముల క్రయ, విక్రయాలన్నీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరుగుతాయని అన్నారు. ఇప్పటికే ఒక లక్షా 64 వేల దరఖాస్తులు వచ్చాయని, ఈ వారం రోజుల్లో మీ సేవ, కలెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పట్టాలు చేసి పాస్‌బుక్ జారీ చేస్తారని, వారం తర్వాత సాదాబైనామా ఉండదని తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ ద్వారానే భూ మార్పిడి జరుగుతుందని, పోడు భూములు, అటవీ భూములు, వక్స్ భూముల వివాదాలను కూడా పరిష్కరిస్తామన్నారు. ఈ సమస్యలకు సమగ్ర సర్వే సమాధానం చెబుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
కొత్త రెవెన్యూ చట్టంలో మోసాలకు ఆస్కారం ఉండదని, పక్కాగా పారదర్శకంగా, సులభంగా స్లాట్ బుకింగ్, వెరిఫికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందన్నారు. ప్రతి అంగుళం భూమి కూడా పోకుండా భద్రంగా నిక్షిప్తం చేయబడుతుందన్నారు. అలాగే పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు, ప్రపంచంలో ఏ మూలనా ఉన్నా భూమి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ధరణి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.