ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం

By అంజి  Published on  7 March 2020 11:15 AM GMT
ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం

ముఖ్యాంశాలు

  • కాంగ్రెస్ సభ్యులను హెచ్చరించిన సీఎం కేసీఆర్
  • కేసీఆర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యుల యత్నం
  • అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్‌

అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకొనేది లేదని కాంగ్రెస్‌ సభ్యులను కేసీఆర్ హెచ్చరించారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా దిండి, పాలమూరు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. హామీలు ఇవ్వటమే తప్ప కేవలం మాటలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు, టీఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రసంగానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డుతగిలారు. కోమటిరెడ్డి తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌కు తోడు మిగిలిన కాంగ్రెస్ సభ్యులుసైతం కేసీఆర్ ప్రసంగానికి అడ్డుతగలడంతో.. స్పీకర్‌ వారించినప్పటికీ వారు వినలేదు. భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనసూయ, జయప్రకాశ్‌రెడ్డి, పోడెం వీరయ్యలు ఉన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ అధికారం కోసమే తాపత్రయమని విమర్శించారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక ౩౩ జిల్లాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నేతలు కొందరు వద్దని అంటే.. మరికొందరు నేతలు కొత్త జిల్లాలకు డిమాండ్‌ చేశారని అన్నారు. వాళ్లలో వాళ్లకే బేధాభిప్రాయాలని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయని, పశ్చిమ బెంగాల్, ఉమ్మడి ఏపీ చేయలేదన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక ముప్పైమూడు జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణను చూశాకే ఏపీ ప్రభుత్వం కూడా జిల్లాలు చూసే యోచనలో ఉందన్నారు. ఏపీ సీఎం జగన్ తనతో మాట్లాడిన దాన్ని బట్టి, తనకున్న సమాచారం ప్రక్రారం ఆంద్రప్రదేశ్‌లో 25జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్లే పాలిస్తారన్నారు.

సభలో ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో ఆత్మ పరిశీలన చేసుకోవటం లేదన్నారు. ప్రజలు ఇవాళ అన్నింటిని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారని కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ అద్భుతమైన పార్టీ అని, కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యారని, అలాంటి దందాలు అన్ని వాళ్లవే అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షానే నిలిచారన్నారు. కోమటిరెడ్డి సభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊపేక్షించమని కేసీఆర్ హెచ్చరించారు. గతంలో ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయొద్దని ఓ సంస్థకు రాజ్‌గోపాల్‌రెడ్డి లేఖ రాశారని అన్నారు. ఈ లేఖ కూడా తమ వద్ద ఉందని కేసీఆర్ అన్నారు.

నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు.. నువ్వెవరు అంటే ఏం చెప్పాలి?

మాకు, మా పార్టీకి కొన్ని సిద్దాంతాలు ఉన్నాయని, ఆ సిద్ధాంతాల ప్రక్రారం ధైర్యంగా మా వాదన వినిపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్‌సీఆర్ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉందని, మన రాష్ట్రంలోనూ ఉందని అన్నారు. వీటిపై ఒకరోజు సభలో చర్చపెడతామని, కూలంకుశంగా చర్చిద్దామని తెలిపారు. నేను మా ఊళ్లో పుట్టానని, అప్పుడు దావఖానాలు లేవని, నాకే బర్త్ సర్టిపికెట్ లేదు.. అలాంటప్పుడు నీవెవరు అంటే ఎలా కుదురుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. అప్పట్లో జన్మపత్రిక రాయించేవారని, ఏ గడియలో పుట్టారో, పేరును నిర్ణయించటానికి బ్రాహ్మణులు చేస్తారని అన్నారు. నా జన్మపత్రం నావద్దే ఉందన్నారు. అది ఇప్పుడు చెల్లుబాటు కాదన్నారు. నాదే దిక్కులేదంటే మీ నాన్నది తేమంటే ఎలా తెస్తారని కేసీఆర్ ప్రశ్నించారు.

దానికి బదులు నేషనల్ ఐడెంటీ కార్డు పెట్టాలని కేసీఆర్ సూచించారు. ఇప్పుడొచ్చిన చట్టం రాజ్యాంగాన్నే అవమాన పర్చే విధంగా ఉందని, ఒక రిలీజియన్ వారిని వ్యతిరేకించండి అనడం సరికాదన్నారు. ఇవన్నీ ఆలోచించి తమకున్న పరిధిలో వాటిపై అసెంబ్లీలో చర్చించి దేశానికి ఒక స్ట్రాంగ్ మెస్సేజ్ ఇద్దామని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో తప్పనిసరిగా సీఏఏపై చర్చ జరుపుతామని, అక్బరుద్దీన్, బీజేపీ ఎమ్మెల్యే రాజీసింగ్లు కూడా ఈ చర్చలో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.

Next Story