లాక్‌డౌన్‌పై రేపు కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 9:48 PM ISTతెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్ధితికి అద్దం పడుతోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అనే అంశంపై రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యకతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నాం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికి కేంద్రం వైఖరి ఎంటో ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీంతో రాష్ట్రంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చించనున్నారు. వర్షాకాలం వ్యవసాయ, నియంత్రిత సాగు, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.