మ‌రికొద్ది రోజుల్లో క‌రోనా కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2020 4:06 PM GMT
మ‌రికొద్ది రోజుల్లో క‌రోనా కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ‌

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌డం శుభ‌సూచ‌క‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే క‌రోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా మారే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఒక్క క‌రోనా యాక్టివ్ కేసు లేని విధంగా మారుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ సోకిన వారిలో 97 శాతానికి పైగా రోగులు కోలుకుని డిశ్చార్జి అవుతుండ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని, వైరస్ వ్యాప్తి, ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు ప్రకటించారు.

సోమవారం ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, నియంత్ర‌ణ‌, లాక్‌డౌన్ ప‌రిస్థితులు, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి తదితరులు పాల్గొన్నారు.

మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతుంద‌ని, ప్ర‌జ‌లెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ధోరణి (ట్రెండ్) చూస్తుంటే వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గిందన్నారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ పాజిటివ్ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని సిఎం ప్రకటించారు.

కాగా సోమ‌వారం తెలంగాణ రాష్ట్రంలో రెండు పాటిజివ్ కేసులు మాత్ర‌మే న‌మోదైయ్యాయి. ఆ రెండు కూడా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనివే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలో 1,003 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి 25 మంది మృత్యువాత ప‌డ్డారు.

Next Story