కిడ్నీ పేషంట్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది..
By అంజి Published on 11 March 2020 2:50 PM IST
హైదరాబాద్: డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు నిర్వహణపై శాసనమండలిలో శేరి సుభాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం 45 సెంటర్లలో 10 వేల మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అవసరం మేరకు డయాలసిస్ సెంటర్‌ల సంఖ్యను పెంచుతామని మంత్రి ఈటల వివరించారు.
డయాలసిస్ క్యాన్సర్ కంటే ఘోరమైనదని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. వారంలో మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తోందన్నారు. డయాలసిస్ పెషెంట్లను పట్టించుకున్నందుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో థంబ్ ఇంప్రెషన్ పడక రోగులు ఇబ్బంది పడుతున్నారని, రెటీనా లేదా ఫేస్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించాలని అన్నారు.
మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగంలో విస్తృత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందన్నారు. వ్యాధి ముదిరిన దశలో డయాలసిస్ చేసుకోవడం లేదా కిడ్నీ ట్రాన్సాంట్ చేసుకునే మార్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, తొమ్మిది టీచింగ్ ఆస్పత్రుల్లో 45 డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్కో సెంటర్‌లో 5 నుంచి 10 వరకు బెడ్స్ ఉన్నాయన్నారు.
ఆస్పత్రికి డయాలసిస్ చేసుకోవడానికి వస్తున్న వారి సంఖ్య ఆధారంగా 24 గంటలు పని చేస్తున్న సెంటర్లు కూడా ఉన్నాయన్నారు. పేషెంట్ రాగానే డయాలసిస్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొన్ని సెంటర్లను నిమ్స్ ఆస్పత్రి, మరి కొన్నింటిని ఉస్మానియా ఆస్పత్రి నిర్వహిస్తున్నాయని తెలిపారు. పూర్తిగా ఉచితంగా డయాలసిస్ అందిస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. ఒక్కో డయాలసిస్ పేషెంట్‌పై సంవత్సరానికి రూ.లక్షా ఎనభై వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. కిడ్నీ సమస్యలు వచ్చి డయాలసిస్ చేసుకుంటున్న కుటుంబాలు నరకం అనుభవిస్తున్నాయి. వారి బాధను తీర్చే భాద్యత తెలంగాణ ప్రభుత్వానిదే అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కౌన్సిల్ లో తెలిపారు.