తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రముఖలు, అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. ట్విట్టర్‌లో హ్యాపీ బర్త్‌ డే కేసీఆర్‌, కేసీఆర్‌ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్స్‌ తెలంగాణలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో మంత్రి హారీశ్‌రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మీ స్వప్నం.. మీ త్యాగం ఫలం, తెలంగాణ అభివృద్ధి మీ దక్షతకు నిదర్శనం, ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష, తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ శతవసంతాలను చూడాలని.. మనసారా కోరుకుంటున్నానని మంత్రి హారీశ్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మేఘాలయ సీఎం కోన్‌రాడ్‌ సంగ్మా ట్విట్టర్‌ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని ఆయన ప్రశంసలు కురిపించారు.

కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వినూత్న రీతిలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ ఆకృతిలో 2,600 మంది విదార్థులతో ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో కవల పిల్లలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌ పిలుపుతో ప్లాస్టిక్‌ నిర్మూలన దిశగా జీవనది ఫౌండేషన్‌ పని చేస్తోంది. కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా 10 వేల బట్ట సంచులను ఫాండేషన్‌ సభ్యులు పంపిణీ చేశారు.

అంబర్‌పేట్‌లో కేసీఆర్‌ వీరాభిమాన సంఘం సభ్యులు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. బర్కత్‌పురాలో ముద్ర కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ సభ్యులు తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.