ఏపీ ఏకపక్ష నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

By Newsmeter.Network  Published on  12 May 2020 9:46 AM IST
ఏపీ ఏకపక్ష నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లి వివాదం రాజుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల కృష్ణా నీటిని లిఫ్ట్‌ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకోసం ఏ విషయంలోనూ వెనక్కు తగ్గేది లేదని తేల్చిచెప్పారు. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లి వాటర్‌వార్‌ మొదలైందని స్పష్టమవుతోంది. ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఎడమొఖం పెడమొఖంగా ఉండేవారు. విభజన హక్కుల విషయంలో, కృష్ణా జలాల పంపకాల విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య విబేధాలు తలెత్తాయి. దీనికితోడు రాజకీయంగానూ చంద్రబాబు, కేసీఆర్‌కు మధ్య పోటాపోటీ నెలకొనడంతో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.

Also Read :కరోనా సోకితే పక్షవాతం వస్తుందా..? ఎంతవరకు అవకాశముంటుంది?

కానీ ఏపీ సీఎంగా జగన్మోహన్‌రెడ్డి ఎన్నికైన నాటి నుండి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లి సహృద్భావ వాతావరణం నెలకొంది. పలుమార్లు జగన్మోహన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి ఇరు రాష్ట్రాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, విభజన హక్కులు సాధించుకోవటం, సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించుకోవటం వంటి అంశాలపై చర్చించారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలోనూ ఇరువురు సీఎంలు చర్చించారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మళ్లి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది.

Also Read : తెలంగాణ: తగ్గినట్లే తగ్గి మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. ఒక్క రోజే 79

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల కృష్ణా నీటిని లిఫ్ట్‌ చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. సోమవారం ప్రతిగతిభవన్‌లో కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తెలంగాణను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలుగా కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయపోరాటం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీనిపై వెంటనే కృష్ణా నీటి యాజమాన్య నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ)లో తెలంగాణ ప్రభుత్వం తరపున ఫిర్యాదు చేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కృష్ణానదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌లో చాలా జాప్యం జరుగుతోందని, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిద్దాం అని, ఆమేరకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ అధికారులకు సూచించారు.

Also Read :గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి హల్‌చల్‌

గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కనపెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం అందించిందని, బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించానని, అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కనీసం తెలంగాణను సంప్రదించడకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం బాధాకరమని కేసీఆర్‌ అన్నారు.కేసీఆర్‌ తీరుచూస్తుంటే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతోంది. కేసీఆర్‌ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా..? లేదా తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ ముందుకెళ్తుందా అనేది ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది.

Also Read :పశువులకు వింత వ్యాధి.. కోడిగుడ్డు సైజులో బుడగలు..

Next Story