నేడు బెంగళూరుకు సీఎం జగన్.. ఎందుకంటే
By సుభాష్ Published on 25 Aug 2020 3:07 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం బెంగళూరుకు వెళ్లనున్నారు. ఆయన 26వ తేదీ వరకు అక్కడే ఉంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. 27న తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే సీఎం జగన్ కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూలులో సీటు వచ్చిందని, తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు జగన్ బెంగళూరుకు వెళ్తున్నారని తెలిపాయి.
కాగా, ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూళ్లలో ఇన్సీడ్ ఒకటి. అక్కడ హర్షారెడ్డి మాస్టర్ చేయనున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షల్లోనూ డిస్టింక్షన్ సాధించారు. ఇప్పటికే లండన్ స్కూలు ఆప్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగి వచ్చినా.. దానిని వదులుకుని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్ చేయడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సతీమణితో జగన్ బెంగళూరు వెళ్తున్నారు.
కాగా, ఆమె చదువుకునే సమయంలోనే తాతా వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందడం, ఆ తర్వాత కాలేజీలో చదువుకునే రోజుల్లో తండ్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం లాంటి ఘటనలను చూసి ఆమె తట్టుకుని చదువు మీద దృష్టి కేంద్రీకరించారు.
కరోనా వైరస్ సమయంలో సీఎం జగన్ రాష్ట్రం దాటి వెళ్లడం ఇదే తొలిసారి. జూన్ 2న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవాలని అనుకున్న జగన్..అది వాయిదా పడింది. ఇప్పుడు కుమార్తె కోసం జగన్ కరోనా సమయంలో తొలిసారి రాష్ట్రం దాటి వెళ్లనున్నారు.