ప్రతి ఆస్పత్రిలోనూ ఐసోలేషన్‌ వార్డు.. సీఎం జగన్‌ ఆదేశం

By అంజి  Published on  5 April 2020 1:23 PM GMT
ప్రతి ఆస్పత్రిలోనూ ఐసోలేషన్‌ వార్డు.. సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు. ఢిల్లీలో జమాత్‌కు హాజరైనవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను వెంటనే పరీక్షలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. తర్వాత సెకండరీ కాంటాక్ట్స్‌పై దృష్టి పెట్టాలన్నారు. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ తరలింపుపై ఇది వరకే ఉన్న మార్గదర్శకాలను సంపూర్ణంగా పాటించాలని, వారికి మంచి సదుపాయాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీని తర్వాత ఇంటింటికీ వెళ్లి సర్వే చేసిన డేటా ఆధారంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి వైద్యులు నిర్దారించిన వారికి తదుపరి దశలో కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా వైరస్‌ నివారణ కింద నిర్దేశించుకున్న విధానాల ప్రకారం ఎప్పటికప్పుడు అడుగులు ముందుకేయాలని సీఎం జగన్‌ సూచించారు.

విశాఖలో ర్యాండమ్‌గా పరీక్షలు..

ఇదే సమయంలో కరోనా వ్యాప్తి స్థాయిని అంచనా వేయడానికి ప్రయోగాత్మకంగా క్లస్టర్ల వారీగా నిర్వహించిన ల్యాబ్‌ పరీక్షల ఫలితాలను అధికారులు సీఎంకు వివరించారు. విశాఖ నగరంలోని కరోనా పాజిటివ్‌ కేసులున్న రెడ్‌ జోన్లను ఎనిమిది క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌ నుంచి 20 నమునాలు చొప్పున తీసుకొని పరీక్షించామని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు, అలాగే రిస్కు ఎక్కువగా ఉన్న వయసులోని వ్యక్తులు, ఇలా అన్ని కేటగిరీల వారీగా ఈ నమునాలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని సర్వే చేయగా వస్తున్న ఫలితాలను, వైద్య సిబ్బంది సేకరించి ఫలితాలను, అలాగే పోలీసుల సహాయంతో సేకరిస్తున్న వివరాలను.. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. వైరస్‌ సోకిన వారికి వైద్యం అందించే విషయంలో తీసుకోవాల్సిన చర్యల విషయంలో పూర్తి సన్నద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఏ రోగి వచ్చినా ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచి చికిత్స చేయాలని సీఎం సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించి అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకొని ఆ మేరకు ఐసోలేషన్‌ వార్డుల్లో ఈ లక్షణాలున్న వారికి చికిత్స అందించాలన్నారు. ఈ విషయంలో ఇది వరకే మార్గదర్శకాలు జారీ చేశామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

వీలైనంత ఎక్కువ మందికి వేగంగా పరీక్షలు చేయించేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటి వరకు ఏడు చోట్ల ల్యాబ్‌లు ఉన్నాయని, విశాఖ, విజయవాడ సహా మూడు చోట్ల ల్యాబ్‌ల సామర్థ్యం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాలో కూడా ల్యాబ్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్ల ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అనంతరం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. జిల్లా వారీగా గుర్తించి ప్రాంతాల్లో మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

Next Story