ఏపీలో సడలింపులు వీటికే..
By తోట వంశీ కుమార్ Published on 18 May 2020 8:56 PM ISTతాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలో బస్సు సర్వీసులను నడపాలని సీఎం నిర్ణయించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు సర్వీసులు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశం మూడు నాలుగు రోజుల్లో ప్రకటించనున్నారు. ఇక కరోనా కారణంగా ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ సమీక్షలో చర్చించారు. కారులో ప్రయాణించేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
బస్సులో 20 మందికి మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రతి దుకాణంలో ఐదుగురు మాత్రమే ఉండాలని, పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మంది వరకే అనుమతి ఉందన్నారు. రెస్టారెంట్ల వద్ద టేక్ అవేకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. టేక్ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందే అని ఆదేశించారు. రాత్రి కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కొనసాగించాలని నిర్ణయించారు. అన్ని దుకాణాలకు ఉదయం 7 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ తెరుచుకునేందుకు అనుమతినిచ్చారు.