జగన్ ప్లాన్ ప్రతిపక్షాలకు శాపంగా మారనుందా..?
By సుభాష్ Published on 10 March 2020 2:44 PM ISTఎన్నికలు ఏవైనా.. సమరం అంతా ఇంతా ఉండదు. నాయకుల మధ్య, ప్రత్యర్థి పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. స్థానిక ఎన్నికలైనా.. పోరులో మాత్రం తేడా ఉండదు. ఎంత ప్రచారం చేసినా.. ఇంకా సరిపోదన్నట్లుగానే ఉంటుంది. ప్రచారంలో ఎవరికి వారే దూసుకుపోతుంటారు. ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల విషయం ఇప్పుడు తెరమీదకు వచ్చింది. పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సాధారణంగా 21 రోజుల గడువు ఉంటుంది. 73,74 రాజ్యాంగ సవరణలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న స్వేచ్ఛ ప్రత్యర్థులకు శాపంగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎన్నికలు రాష్ట్ర సర్కార్ నిర్వహణలో సాగాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనే అంతా చూసుకుంటుంది. ఇప్పుడు ఏపీలో నిర్వహించే ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది.
కాగా, ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంగా ఎన్నికల గడువు 21 రోజుల నుంచి భారీగానే తగ్గించింది. పంచాయతీ ఎన్నికలకు 13 రోజులు, ఎంపీటీసీ ఎన్నికలకు 15 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో ఆయా రోజుల్లో ఎన్నికల నిర్వహణ, ప్రచారం, అభ్యర్థుల ఎంపిక వంటి ప్రక్రియ సాగాలి. ఇక అభ్యర్థుల తుది జాబితా వెలువడిన తర్వాత పంచాయతీ ఎన్నిలకు నాలుగు రోజులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం మిగిలి ఉంది. దీంతో ప్రతిపక్షాలు సహా అధికార పక్షం సభ్యులు కూడా ఆందోళన చెందాల్సి వస్తోంది. సమయం సరిపోక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కాగా, ప్రచారం చేసుకునేందుకు తక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఇంత తక్కువ సమయంలో ఎలా ప్రచారం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పెద్దగా నష్టం ఉండదు, అదే ప్రత్యర్థులకు ఈ తక్కువ సమయమే శాపంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది జగన్ ప్లాన్ కావచ్చని అంటున్నారు. ఇలా సమయం తగ్గించడం వల్ల ప్రత్యర్థి ప్రచారం చేసుకునే వెలుసుబాటు ఉండకూడదనేది సర్కార్ ఉద్దేశమని ఆరోపణలు వస్తున్నాయి.
అధికార పక్షం అభ్యర్థులకు ప్రచారం లేకపోయినా..
ఇక అధికార పక్షం అభ్యర్థులకు పెద్దగా ప్రచారం లేకపోయినా నష్టమేమి ఉండదు. కానీ ప్రత్యర్థులకు మాత్రం ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. ఇక కొత్తవారు కనుక బరిలో దిగితే వారు పరిచయం చేసుకునేందు కూడా సమయం సరిపోదు.. ఇక ప్రచారమేమి నిర్వహిస్తారు. ఈ స్థానిక సంస్థల ఎన్నిలకు సమయం తక్కువగా ఉండటంతో అధికార పార్టీకి మేలు జరుగుతుందని రాజకీయ నేతలు అంటున్న మాట. మరి సీఎం జగన్ వ్యూహాన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకుంటారా..? లేదా అనేది చూడాలి.