అమరావతి: ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయనం అంటూ బీజేపీ నేతలు మాట్లాడిన తరుణంలో సీఎం జగన్‌ రాసిన లేఖకు ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టినందుకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. బడ్జెట్‌పై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారనిన జగన్ లేఖలో తెలిపారు. కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకునేందుకు బడ్జెట్‌లో ఎటువంటి అంశాలు లేకపోవడం అసంతృప్తికి కారణమని సీఎం జగన్‌ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం రిపోర్టును దృష్టిలో పెట్టుకొని మీ సలహాలు, మద్దతు కోరేందుకు ఈ లేఖ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

విభజనస సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని లేఖలో గుర్తు చేశారు. తెలంగాణతో విడిపోయాక ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. 14వ ఆర్థిక సంఘం రిపోప్టులో ప్రత్యేక హోదాపై ప్రస్తావన లేదు.. అయినా దానిని సాకుగా చూపారని సీఎం జగన్‌ అన్నారు. 15వ ఆర్థిక సంఘం తమ అభ్యర్థనలు ఆలకించినప్పటికి ప్రత్యేక హోదా అంశం వారి పరిధిలో లేదని తేల్చిందని సీఎం జగన్‌ లేఖలో తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం రిపోర్ట్‌ ప్రకారం హోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని తేల్చిందన్నారు. ఈ నేపథ్యంలో మీరే(మోదీ) చొరవ తీసుకొని ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నామని సీఎం జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక సహాయంత్రి అనురాగ్‌ సింగ్ ఠాకూర్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట వాస్తవమేనని, అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో అది పూర్తిగా రద్దైపోయినట్లేనని అన్నారు. మరీ సీఎం జగన్‌ రాసిన లేఖకు ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.