విపక్ష పార్టీలన్నీ కలిసి పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఆయన ఉన్న ఉన్నత పదవి గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను ప్రధానమంత్రి చేశారని వారు ఆక్షేపించారు. అంతే కాక రాష్ట్రపతి జోక్యం చేసుకుని, పౌరసత్వ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రపతికి ఒక మెమొరాండం ను బుధవారం నాడు సమర్పిస్తూ విపక్ష నేతలు అఫ్ఘనిస్తాన్ , పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో మెజారిటీ జనాభా చేతిలో అత్యాచారాలకు, దాడులకు గురవుతున్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవ, పార్సీలకు బారత్ పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా విమర్శించారు. దీనిపై చట్టబద్ధంగా తమ వ్యతిరేకతను తెలిపే అధికారం ప్రజలకుందని వారన్నారు. బీజేపీ ప్రోత్సహిస్తున్న తరహా రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడుతుందని వారు అన్నారు.

ఈ మెమోరాండం పై కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ జే డీ, తృణమూల్ కాంగ్రెస్, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, డీ ఎం కె. సీపీఎం, సీపీఐల నాయకులు సంతకాలు చేశారు. ప్రధానమంత్రి ఇటీవల జార్ఖండ్ లో ఒక ప్రసంగంలో వారు వేసుకున్న దుస్తులను బట్టి వారెవరో ఇట్టే తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ప్రధాని వ్యాఖ్యల వల్ల ఇన్నాళ్లూ జాగ్రత్తగా నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థ ధ్వంసమైపోతుందని, ప్రధాని సంకుచిత వర్గ వివక్షను ప్రదర్శించడం తగదని వ్యాఖ్యానించాయి.

హింసకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మెమొరాండం పై కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, జైరామ్ రమేశ్, తృణమూల్ ప్రతినిథి డెరిక్ ఓబ్రీన్, డీఎంకే నేత టీఆర్ బాలు, సీపీఎం నేత సీతారాం యేచూరి, సీపీఐ నేత డీ రాజా, ముస్లిం లీగ్ కు చెందిన ఈ టీ మహ్మద్ బషీర్, సమాజ్ వాదీ పార్టీకి చెందిన జావేద్ అలీ ఖాన్, నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందిన హస్నైన్ మాలోడీ, అస్సాం కి చెందిన సిరాజుద్దీన్ అజ్మల్ లు సంతకం చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.