జూలై 20 నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
By సుభాష్ Published on 17 July 2020 1:04 PM IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కొరలు చాస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా వ్యాపించి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎటు చూసినా కరోనా గురించే చర్చ. ఈ వైరస్ కారణంగా చాలా మంది బతుకులు బజారు పడ్డాయి. సామాన్యుడి నుంచి వ్యాపారం చేసుకునే వారి వరకు జీవన విధానం దారుణంగా మారిపోయింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని రంగాలు మూతపడ్డాయి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు రెస్టారెంట్లు లాంటి వ్యాపారాలను మూసివేశాయి. అయితే లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా.. సినిమా థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. అయితే జూలై 20వ తేదీ నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. కానీ మన దేశంలో కాదు.. చైనా దేశంలో. కరోనాతో మూడపడ్డ థియేటర్లు చైనాలో ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఇక ఆ దేశంలో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జూలై 20వ తేదీ నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నట్లు చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
థియేటర్లకు వచ్చేవారికి మార్గదర్శకాలు
సినిమా థియేటర్లకు వచ్చేవారు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. థియేటర్లలో భౌతిక దూరం, మాస్క్ లు ధరించడం తప్పనిసరి అని సూచించింది. బయటి దేశాల నుంచి వచ్చిన వారు తప్ప గత పది రోజులుగా చైనాలో ఎవరు కూడా కరోనా బారిన పడకపోవడంతో థియేటర్లు తెరిచేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మరో వైపు యూరఫ్ ఖండంలో కూడా కరోనా అదుపులోకి రావడంతో అక్కడ కూడా సినిమా థియేటర్లకు అనుమతి లభించింది. ఇక మన దేశంలో అయితే థియేటర్లు ఓపెన్ అవుతాయో.. లేదో తెలియని పరిస్థితి. ముందుగా జూలైలో తెరుచుకుంటాయని వార్తలు వచ్చినా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది. థియేటర్లు తెరుచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నా.. ప్రభుత్వం మాత్రం అనుమతి ఇచ్చేందుకు పెద్దగా సహసించడం లేదు. ఎందుకంటే దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉంది. ఇప్పటికే లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా పెరిపోయిన పాజిటివ్ కేసులు.. ఇక థియేటర్లు తెరుచుకుంటే మాత్రం ఇంక అంతే సగతి. ఏది ఏమైనా మన దేశంలో మాత్రం ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు.