బయటపడుతున్న సీఐ శంకరయ్య భారీ అక్రమాస్తులు.. ఏసీబీ దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు

By సుభాష్  Published on  11 July 2020 12:13 PM IST
బయటపడుతున్న సీఐ శంకరయ్య భారీ అక్రమాస్తులు.. ఏసీబీ దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు

పోలీస్‌ ఉద్యోగంలో చేరి కోట్లు సంపాదించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. లంచాల ముసుగులో ఇళ్లు, భూములు, బంగారం భారీగా కూడబెట్టుకున్నాడు. లంచాలకు మరిగి అడ్డదారులు దొక్కాడు. చివరికి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి పోయాడు. అతనే రంగారెడ్డి జిల్లా షాబాద్ సర్కిల్ ఇన్స్‌ పెక్టర్‌ శంకరయ్య. ఓ భూమి వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బులు డిమాండ్‌ చేసిన శంకరయ్య ఏసీబీకి చిక్కాడు. దీంతో అతని ఆస్తులపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

భూమి సెటిల్మెంట్‌ వ్యవహారంలో రూ.1.20 లక్షలు డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడటంతో సీఐ శంకరయ్యతో పాటు ఏఎస్సై కె. రాజేందర్‌లను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ ఇంట్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించగా, మొత్తం 17.88 లక్షల నగదు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల షాబాద్‌ సీఐగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే అడ్డంగా దొరికిపోయారు. అయితే సర్వీస్‌లో చేరినప్పటి నుంచి శంకరయ్య అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించింది.

రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ముల్కపట్నం, సూర్యాపేట జిల్లా మోతె గ్రామాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఆయన బంధువుల ఇండ్లల్లోనూ భారీ ఎత్తున అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇండ్లు, ప్లాట్లు, పొలాలు, అభరణాలు కలిపి మొత్తం రూ.4.62 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

సోదాల్లో బయటపడ్డ ఆస్తులు

♦ రూ.1.05 కోట్ల విలువైన రెండు ఇళ్లు

♦ రూ. 2.28 కోట్ల విలువైన 11 ఇండ్ల స్థలాలు

♦ నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌, వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలలో కలిపి రూ.77 లక్షల విలువైన 41 ఎకరాలకుపైగా వ్యవసాయ భములు.

♦ రూ.7 లక్షల విలువ చేసే స్విప్ట్‌ కారు

♦ రూ. 21లక్షలకుపైగా విలువ చేసే బంగారు అభరణాలు, రూ.81వేల విలువైన వెండి అభరణాలు.

♦ రూ.6.13 లక్షల విలువైన గృహోపకరణాలు బయటపడ్డాయి.

అలాగే శంకరయ్య బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ అధికారులు పరిశీలించారు. గురువారం నాడు అదుపులోకి తీసుకున్న సీఐ శంకరయ్య, ఏఎస్సై రాజేందర్‌ను నాంపల్లిలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తరలించి, అక్కడి నుంచి కరోనా పరీక్షల నిమిత్తం కింగ్‌ కోఠి ఆస్పత్రికి తరలించి, పరీక్షల అనంతరం సీఐ, ఏఎస్సైలను ఏసీబీ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఏసీబీ న్యాయమూర్తి వీరిద్దరికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

చిగురుపాటి జయరాం హత్య కేసులోనూ సంబంధాలు..?

అలాగే శంకరయ్య అక్రమార్జన కేసులు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పాత నేరస్తులతో ఉన్న సంబంధాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్య కేసుతోనూ శంకరయ్యకు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఏసీబీ విచారణ ముమ్మరం చేసింది. జయరాం హత్య కేసు నిందితులకు పలు రకాలుగా సీఐ శంకరయ్య సహాయం చేసినట్లు తెలుస్తోంది. జయరాం, శిఖా చౌదరి కాల్స్‌ను రికార్డ్‌ చేయడానికి నిందితుడు రాకేష్‌ రెడ్డికి శంకరయ్య సహాకరించినట్లు సమాచారం. రాకేష్‌ రెడ్డికి పలు భూముల సెటిల్మెంట్‌లో శంకరయ్య సహకరించాడని సమాచారం. అయితే చిగురుపాటి జయరాం హత్య కేసులో బయటపడుతున్న శంకరయ్య సంబంధాలపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story