Fact Check : తమిళనాడులోని ఏ హిందూ దేవాలయాన్ని క్రైస్తవ మిషనరీ ఆక్రమించలేదు. దానిని చర్చ్ గా మార్చనూ లేదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 9:43 AM GMT
Fact Check : తమిళనాడులోని ఏ హిందూ దేవాలయాన్ని క్రైస్తవ మిషనరీ ఆక్రమించలేదు. దానిని చర్చ్ గా మార్చనూ లేదు

‘హిందువులు అధికసంఖ్యలో ఉన్నప్పటికీ అదిమాన్, రామనాథపురంలో టిఎన్ మిషనరీ స్టూజెస్ అత్యంత పురాతన హిందూ దేవాలయాన్ని ఆక్రమించింది.’ అనే సందేశంతో సోషల్ మీడియా వినియోగదారులు కొందరు గత రెండు మూడు రోజులుగా ఒక ఫోటోను షేర్ చేస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న యూజర్లు ఆ ఫోటోను వైరల్ చేయటంతో పాటుగా, అలా హిందూ దేవాలయాన్ని ఆక్రమించుకున్న క్రిస్టియన్ మిషనరీ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

T1

T2

T3

నిజ నిర్థార‌ణ‌ :

న్యూస్ మీటర్ ఆ వైరల్ ఫోటో వెనుక నిజం తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఆ ఫోటోను పరిశీలించినప్పుడు స్తంభాలపై చెక్కిన శిలువ గుర్తులు ఆ నిర్మాణం క్రిస్టియన్ సంస్థకు చెందినదేమో అనిపించింది. లోపల ఒక బాలిక మాస్క్ ధరించి కనబడుతోంది కాబట్టి ఆ ఫోటో ఈ మధ్యనే తీసిన ఫోటో అనిపిస్తోంది.

T4

వైరల్ అవుతున్న ఆ ఫోటోను గూగుల్ ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసేందుకు ప్రయత్నించాం. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు.

ఇంగ్లీష్ పోస్టుల్లోని వాక్యం ‘In Adhiyaman, Ramanathapuram, TN Missionery stooges have occupied the most ancient Hindu Temple’ తో గూగుల్ సెర్చ్ చేసినప్పుడు వచ్చిన ఫలితాలలో ఒక రెడ్డిట్ పేజీ ఆకర్షించింది. ఈ వైరల్ ఫోటో గురించిన చర్చలో ఒక యూజర్ ఆ నిర్మాణానికి సంబంధించిన వివరాలు అందించారు. ఆ వివరాల ప్రకారం ఆ నిర్మాణం.. తమిళనాడులోని తేన్కాశీ జిల్లాలోని కుర్తాళం గ్రామంలో నేషనల్ మిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (NMSI) నడుపుతున్న ఒక ఆశ్రమానికి ప్రవేశ ద్వారం.

ఈ వివరాలతో మళ్లీ సెర్చ్ చేసినప్పుడు ఒక ఫేస్ బుక్ యూజర్ తమ అకౌంటులో షేర్ చేసిన ఫోటోలు కనిపించాయి. వారు ఆ ఆశ్రమాన్ని 2013 లో విజిట్ చేసినప్పుడు తీసుకున్న ఫోటోలు అవి.

T5

T6

మరికొంత సెర్చ్ చేసిన తర్వాత NMSI ఫేస్ బుక్ పేజీలో మరికొన్ని ఫోటోలు, వివరాలు కనిపించాయి.

వాటిలో ఇలాంటిదే మరో నిర్మాణం కనిపించింది. అది తిరుపత్తూరులోని క్రీస్తుకుల ఆశ్రమం ప్రవేశ ద్వారం.

T7

T8

హిందూ దేవాలయం గోపురం ఆకృతిలో ఉన్న ఈ ప్రవేశద్వారాల గురించి మరికొంత సమాచారం http://voiceofdharma.org/books/ca/ch05.htm వెబ్ పేజీతో పాటుగా Jesus as Guru అనే పుస్తకంలోని Chapter 8: The Eternal Christ in the Ashram Movement (https://petervas.files.wordpress.com/2013/03/jesus_as_guru1.pdf) లో లభించింది. దాని ప్రకారం తిరుపత్తూరులోని క్రీస్తుకుల ఆశ్రమం 1921 లో నిర్మించారు.

సాధు సుందర సింగ్ అనే ఇండియన్ క్రిస్టియన్ మిషనరీ కాషాయ వస్త్రాలు ధరించి, స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ క్రీస్తు గురించిన భోదనలు చేసేవాడు. అతని స్ఫూర్తితో ఇద్దరు వైద్యులు డా. ఎస్. జేసుదాసన్, డా. ఎర్నెస్ట్ ఫారెస్టర్ పాటన్ క్రీస్తుకుల ఆశ్రమ ఉద్యమాన్ని 1920 లో తిరుపత్తూరులో ప్రారంభించారు. వీరి ఆశ్రమ ఉద్యమానికి మహాత్మ గాంధీ మద్ధతు ఉందని కూడా ఆ పుస్తకంలో రాశారు.

అయితే, వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న కుర్తాళం ఆశ్రమం ఏదైనా ఆలయాన్ని ఆక్రమించి కట్టినదా అనే విషయం తెలుసుకోవటానికి NMSI జనరల్ సెక్రటరీ రెవరెండ్ ఎస్ క్రిస్టోఫర్ విజయన్ ను ఫోన్ ద్వారా న్యూస్ మీటర్ సంప్రదించింది.

T9

హిందూ ఆలయాన్ని ఆక్రమించారనే ఆరోపణని ఖండించిన ఆయన, తమ లాంటి మరికొన్ని క్రిస్టియన్ సంస్థలు స్వాతంత్ర్యానికి పూర్వమే స్థానిక ఆలయనిర్మాణ శైలిలో ఆశ్రమాలను నిర్మించాయని చెప్పారు. కుర్తాళంలో ఆశ్రమాన్ని, వైద్యశాలను 1950కు ముందునుంచే NMSI నడుపుతోందని ప్రకటించారు.

కాబట్టి, వైరల్ అవుతున్న సందేశంలో ఉన్నట్లుగా.. తమిళనాడులో హిందూ దేవాలయాన్ని క్రిస్టియన్ మిషనరీ సంస్థ ఆక్రమించటం, దాన్ని చర్చ్ గా మార్చటం అనేది అసత్యం. పైగా ఫోటోలో ఉన్న గోపురం అదిమాన్, రామనాథపురంలో కాక కుర్తాళంలో ఉంది.

ఈ వైరల్ ఫోటో గురించిన సత్యాన్వేషణలో న్యూస్ మీటర్ మరికొన్ని క్రీస్తు దేవాలయాలను గమనించింది.

వాటిలో కొన్ని మా రీడర్స్ కోసం..

తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా తన్నీర్ పల్లి లోని సచ్చిదానంద ఆశ్రమం

T10

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం దగ్గర ఉన్న శాంతినగర్ లోని జీయోను కొండపై చర్చ్

T11

Next Story