మరికొన్ని రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) ప్రారంభం కానున్న తరుణంలో ఢీల్లీ క్యాపిటల్స్‌ జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఐపీఎల్‌-13వ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌ 19న కోల్‌కత్తాలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.1.50కోట్లకు కొనుగోలు చేసింది. టెస్టు క్రికెట్‌లో మరింతగా రాణించేందుకు ఐపీఎల్‌కు దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

జూన్‌ 4 నుంచి ఇంగ్లాండ్‌ రెండు టెస్టు సిరీసుల్లో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలుత శ్రీలంకతో తర్వాత వెస్టిండీస్‌తో మూడేసి మ్యాచులు ఆడనుంది. దీంతో ఆ టెస్టు సిరీసుల్లో రాణించేందుకు క్రిస్‌వోక్స్‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. కాగా ఈ విషయం ఇప్పటికే సదరు ప్రాంఛైజీకి తెలియజేశాడని.. ప్రాంఛైజీ కూడా ఈ ఆటగాడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవడానికి సన్నాహాకాలు ప్రారంభించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ పేసర్లు ముగ్గురు గాయాలతో సతమతమవుతుండడం ఆ జట్టుకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఆ జట్టు ప్రధాన పేసర్లు రబడా, ఇషాంత్‌ శర్మ లు గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. కివీస్‌తో టెస్టు సిరీస్‌తో మడమగాయం తిరగబెట్టడంతో ఇషాంత్ సిరీస్‌ నుంచి స్వదేశానికి వచ్చేసిన సంగతి తెలిసిందే. గాయం నుంచి పూర్తిగా ఇషాంత్ కోలుకోవడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. గాయం కారణంగా రబడా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకవేళ తాను ఫిట్‌ అయితే ఐపీఎల్‌కు అందుబాటులోకి వస్తానని చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చు. సుదీర్ఘ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిండంతో ఐపీఎల్‌లో రబడా ఆడటం అనుమానమే. ఈ తరుణంలో వోక్స్‌ హ్యాండిస్తే మాత్రం ఢిల్లీ పేస్‌ బౌలింగ్‌ విభాగం బలహీన పడుతుంది.

మార్చి 29 నుంచి ఐపీఎల్‌-13వ సీజన్‌ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో ముంబాయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఢీకొననున్నాయి. కాగా ఢిల్లీ తన తొలి మ్యాచ్‌ను 30న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆడనుంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.