ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ మార్చి 29న ఆరంభం కానుంది. ఏప్రిల్‌ 1న సన్‌ రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్‌ ముంగిట కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విలియమ్‌సన్‌ ను తప్పించింది. తిరిగి రెండేళ్ల తరువాత ఆ బాధ్యతలను ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు అప్పగించింది. దీంతో కివీస్ ఆటగాడు విలియమ్‌సన్‌ ఇక బ్యాట్స్‌మెన్‌గానే కొనసాగనున్నాడు.

2014 చివర్లో జరిగిన వేలంలో డేవిడ్‌ వార్నర్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్‌.. 2015 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు అప్పగించింది. వార్నర్‌ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్‌ 2016లో మొదటి సారి ఐపీఎల్‌ టైటిల్‌ ను ముద్దాడింది. అయితే 2018లో బాల్‌ టాంపరింగ్‌ కారణంగా.. వార్నర్‌ పై ఏడాది నిషేదం పడింది. దీంతో వార్నర్‌ వారసుడిగా న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌విలియమ్‌సన్‌ను ఎంపికచేశారు

2018, 2019 సీజన్లలో కేన్‌ సారథ్యంలోనే హైదరాబాద్‌ బరిలోకి దిగింది. హాట్‌ ఫేవరేట్‌గానే బరిలోకి దిగినా.. టైటిల్‌ను గెలవలేకపోయింది. నిషేదం ముగిసిన తరువాత 2019లో వార్నర్‌ అందుబాటులోకి వచ్చినా.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ నిరాకరించింది. బాల్ టాంపరింగ్‌తో నిషేధానికి గురై ఉండటంతో.. బ్రాండ్ వాల్యూ దెబ్బ తింటుందనే ఉద్దేశంతో ఫ్రాంఛైజీ వెనకడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా.. మళ్లీ ఈ ఆస్ట్రేలియన్‌ ఆటగాడిపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటి వరకూ 126 మ్యాచ్‌లాడిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్.. 142.39 స్టైక్‌రేట్‌తో 4,706 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డేవిడ్‌ వార్నర్‌ సారధ్యంలో మరోసారి టైటిల్ అందుకోవాలని అభిమానులతో పాటు జట్టు యాజమాన్యం కోరుకొంటోంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.