ఆ పిచ్చితోనే న‌టుడ‌య్యాడు.. సాధించాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 April 2020 4:44 AM GMT
ఆ పిచ్చితోనే న‌టుడ‌య్యాడు.. సాధించాడు..!

చియాన్ విక్ర‌మ్‌.. భార‌తీయ సినిమా న‌టుల‌లో క‌మ‌ల్‌హాస‌న్ త‌ర్వాత ఆ స్థాయి పేరొందిన న‌టుడు. శివ‌పుత్రుడుతో స‌త్తా చాటి.. అప‌రిచితుడుతో త‌న న‌ట‌నా శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన న‌టుడు. తెలుగు, తమిళ, హిందీ బాష‌ల‌లో ప‌లు సినిమాల్లో న‌టించిన విక్ర‌మ్.. పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జీవిత విశేషాల‌ను తెలుసుకుందాం.

జ‌న‌నం :

విక్ర‌మ్ తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా పరమకుడిలో జ‌న్మించారు. విక్రమ్ తండ్రి వినోద్ రాజ్. పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. ఇక విక్ర‌మ్ స్కూలింగ్ మొత్తం యార్కాడ్‌లో జ‌రిగింది. అనంత‌రం చెన్నైలోని లయోలా డిగ్రీ కాలేజీలో బీఏ ఇంగ్లీస్ లిట‌రేచ‌ర్‌.. ఎంబీఏ కూడా అక్కడే చదివాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విష‌య‌మేమిటంటే.. విక్ర‌మ్ సొంత‌వూరు ప‌ర‌మ‌కుడి నుండే చారుహాసన్, కమల్‌హాసన్, సుహాసిని సినీరంగ ప్ర‌వేశం చేసి జాతీయ ఉత్త‌మ న‌టులుగా ఎదిగారు.

సినిమాలంటే పిచ్చి :

విక్ర‌మ్‌కు తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన‌ శివపుత్రుడు తమిళ వెర్ష‌న్‌ పితామగన్ చిత్రంలో న‌ట‌న‌కు జాతీయ ఉత్తమ నటుడి పుర‌స్కారం ల‌భించింది. అయితే.. విక్రమ్ కు ఆ అవార్డు రావడం వెనుక ఇరవయ్యేళ్ళ కృషి ఉంది. త‌న‌కు చిన్న‌త‌నం నుండి సినిమాలంటే పిచ్చి. ఈ నేప‌థ్యంలోనే చెన్నైలో చ‌దువుకుంటున్న‌ప్పుడు విక్ర‌మ్ హాలీవుడ్ సినిమాలు ఎక్కువ‌గా చూసేవాడు. ఎలాగైనా న‌టుడు కావాల‌నే ఉద్దేశంతో కరాటే, స్విమ్మింగ్‌, గిటార్, పియానో ఇలా అన్నింట్లో త‌ర్పీదు పొందేవాడు. విక్రమ్ కు బైక్ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం.

సినిమాల్లోకి ఎంట్రీ :

విక్ర‌మ్‌.. 1990వ సంవ‌త్స‌రంలో కాద‌ల్ క‌న్మ‌ణి అనే త‌మిళ చిత్రం ద్వారా సినీరంగ ప్ర‌వేశం చేశారు. ద‌ర్శ‌క‌ర‌త్న‌ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం(1993) సినిమా ద్వారా తెలుగు తెర‌కూ ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ స్నేహితుడి పాత్రలో నటించాడు విక్రమ్. అనంత‌రం కొన్ని తెలుగు స్ట్ర‌యిట్ చిత్రాల్లో కూడా న‌టించారు. 9 నెలలు, శివపుత్రుడు, అపరిచితుడు, మజా, మల్లన్న, రావణ్, నాన్న, ఐ, మిస్టర్ కేకే వంటి చిత్రాల‌తో విక్ర‌మ్ న‌టుడిగా ఎంతో గుర్తింపు పొందారు.

సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డే విక్ర‌మ్ 'ఐ' సినిమా కోసం ఇర‌వై ఐదు కిలోల బ‌రువు తగ్గాడంటే.. త‌న‌కు సినిమాలంటే ఎంతో ఇష్ట‌మో తెలుస్తుంది. దాదాపు 25 ఏళ్లుగా చిత్ర‌సీమ‌లో ఉన్న విక్ర‌మ్.. ఈ మ‌ధ్య‌నే త‌న త‌న‌యుడు దృవ్ విక్ర‌మ్‌ను కూడా న‌టుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్‌లో దృవ్ హీరోగా న‌టిస్తున్నాడు. న‌టుడిగా ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు పోషించిన విక్ర‌మ్.. ప్రేక్ష‌కుల గుండెల్లో చిరస్మ‌ర‌ణీయ‌మైన స్థానం సంపాదించుకున్నారు. నేడు 55వ వ‌డిలోకి అడుగిడుతున్న సంద‌ర్బంగా.. న్యూస్ మీట‌ర్ తెలుగు ప్ర‌త్యేక క‌థ‌నం.

Next Story