కరోనా ఎఫెక్ట్.. గాంధీ ఆస్పత్రిలో చైనీయుల క్యూ..!

By అంజి  Published on  8 Feb 2020 8:22 AM GMT
కరోనా ఎఫెక్ట్.. గాంధీ ఆస్పత్రిలో చైనీయుల క్యూ..!

ముఖ్యాంశాలు

  • హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న చైనీయులపై అనుమానాలు
  • కరోనా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ కోసం వస్తున్నట్లు చెబుతున్న వైద్యులు
  • ఇద్దరు చైనీయులకు కరోనా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు జారీ

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో చైనా వాసులు బారులు తీరారు. తమకు కరోనా సోకిందన్న భయంతో కొందరు.. లేదని చెప్పుకోడానికి కొందరు చైనీయులు గాంధీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న చైనీయులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి కరోనా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ కోసం చైనీయులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా విదేశాల్లో ఉన్న చైనీయులతో పాటు, భారత్‌లోని చైనీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో చైనీయులు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు చైనీయులకు కరోనా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లను వైద్యులు జారీ చేశారు. నిన్న, మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఇద్దరు చైనీయులకు కరోనా వైరస్‌ సోకిందనే అనుమానానికి వైద్యులు చెక్‌ పెట్టారు. వారికి ఎలాంటి కరోనా వైరస్‌ సోకలేదని రిపోర్టుల్లో తేల్చారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 26 మందిని పరీక్షించారు. వారందరికి కూడా నెగిటివ్‌ వచ్చిందని వైద్యులు చెప్పారు.

కరోనా వైరస్‌ సోకిందని అనుమానిస్తున్న వ్యక్తులను వైద్యులు ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సృష్టం చేశారు. నగరంలోని ఫీవర్‌, గాంధీ ఆస్పత్రుల్లో కరోనా అనుమానితులకు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఆస్పత్రులకు వస్తున్నవారికి సాధారణ జ్వరాలేనని, ఎక్కడా కరోనా లక్షణాలు కనిపించలేదని వైద్యులు అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్టులు జరుగుతున్నాయి.

మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా చైనాలో 724కి చేరింది. 34,500 మందికి కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా వైరస్‌ 24 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొన్ని దేశాల ఆర్థిక వ్యవహారాలపై కూడా కరోనా వైరస్‌ ప్రభావం పడుతోంది. మనదేశంలో ఈ వైరస్‌ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండకాలం రానుండడంతో ఈ వైరస్‌ కేసులు పెరిగే అవకాశాలు చాలా తక్కువని వైద్య నిపుణులు అంటున్నారు.

Next Story