ఈ మోడల్ ఇల్లు చూస్తే మీరు వదిలిపెట్టరు!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2019 6:31 AM GMTనట్టనడి సంద్రంలో ఒక భారీ నత్త... దగ్గరకి వెళ్లి చూస్తే అదొక ఆర్కిటెక్చరల్ అద్భుతం. అందులో హాయిగా నివాసం ఉండొచ్చు. అలలతో ఆడుకుంటూ, సముద్రంతో సరసమాడుతూ వచ్చే పడవల్ని, వెళ్లే చేపల్ని పలకరించుకోవచ్చు.
సముద్రపుటలలపై తేలాడుతున్న భవంతి... ఉయ్యాల జంపాల అంటూ కాలం గడిపేయవచ్చు. ఫ్లోరింగ్ వైపు చూస్తే అంతా పారదర్శకం. కోరల్స్, చేపల క్వారల్స్ అన్నీ అక్వేరియంలో చూసినట్టు కనిపిస్తాయి.
బోల్డన్ని శంఖాలు, అల్చిప్పలు ఓ వర్తులాకార డిజైన్ లో సముద్ర ద్వీపం అంచున అమరి ఉంటే.... అందులో మనం నివాసముంటే... పైన ఆకాశం నీలం... కింద సముద్రం నీలం.... ఊహించుకుంటేనే గిలిగింతలు వచ్చేస్తున్నాయి కదూ....
కొండ అంచున రాళ్లను కరుచుకుని ఒక వేలాడే ఇల్లు... అచ్చం త్రిశంకు స్వర్గం లాగానే... అందులో ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.
ఇలాంటి చిత్ర విచిత్ర ఆవాసాలు ఇప్పుడు చైనాలో పుట్టుకొస్తున్నాయి. భవిష్య భవన కళకు అద్దం పడుతున్నాయి. మనిషిలో ఎన్నికోర్కెలుంటే అన్ని మాడల్స్ అందుబాటులో ఉన్నాయి. చైనాలో ఈ భవిష్య భవనాలే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్.
చైనాలో ఇప్పటికే పది వైట్ హౌస్ నమూనా ఇళ్లు, ఒక ఐఫిల్ టవర్ నమూనా ఇల్లు ఉన్నాయి. ఇంకా ఇంకా చిత్ర విచిత్ర మోడల్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రజల ఆర్ధిక సత్తా పెరుగుతున్న కొద్దీ ఇలాంటి వింత వింత భవంతులు వచ్చేస్తున్నాయి. 1975 ప్రాంతంలో చైనాలో కేవలం 18 శాతం జనాభా మాత్రమే నగరాల్లో ఉండేది. ఇప్పుడు 56 శాతం మంది నగరాల్లో ఉన్నారు. కాబట్టి కొత్త కొత్త మోడల్స్ పుట్టుకొస్తున్నాయి.
చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ 2014 లోనే ఇళ్ల నిర్మాణంలో వెర్రి తలలు వేయొద్దని ఆదేశించాడు. కానీ ప్రజల ఊహలను ఆపడం ఎవరి తరం? అందుకే రోజుకో కొత్త మోడల్ ఇల్లు చైనాలో దర్శనమిస్తున్నాయి. ఇలాంటి ఓ కలల ఇల్లు మనమూ కోరుకుందామా? ఆ కోరికను నిజం చేసుకుందామా?