కరోనాను చైనా అదుపు చేసిందిలా..

By రాణి  Published on  13 March 2020 4:27 PM IST
కరోనాను చైనా అదుపు చేసిందిలా..

ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్ పేరు చెబితే చాలు గడగడలాడిపోతోంది. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. దేశాలకు దేశాలు దిగ్బంధనం అవుతున్నాయి. ఇటలీ లాంటి దేశం మొత్తం ఒక జైలులా మారిపోయింది. కానీ కరోనా వ్యాధి పుట్టిన చైనా మాత్రం ఇప్పుడు కరోనాను ఓడించేసింది. కరోనా కేసులు చైనాలో తగ్గిపోవడమే కాదు, చాలా మంది రోగులు చికిత్స పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కొద్ది వారాల క్రితం రోజుకు వేలాది కేసులు నమోదు చేసుకున్న చైనాలో ఇప్పుడు రోజుకి రెండు మూడు కేసులు కూడా నమోదు కావడం లేదు. ఇప్పటి వరకూ చైనాలో 80995 కేసులు నమోదయ్యాయి. అందులో 62888 మంది ఆరోగ్యవంతులయ్యారు. కానీ చైనాలో చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల వల్ల కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక కేసు నుంచి నాలుగు కేసులు వచ్చే స్థితి నుంచి 0.38 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇంత తక్కువ కేసులు ఉన్నాయంటే దాదాపుగా వ్యాధి అదుపులోకి వచ్చినట్టే.

Also Read : భారత్ లో రాష్ర్టాల వారీగా కరోనా బాధితుల సంఖ్య ఇలా..

చైనాలో నియంతృత్వం ఉండటం, చైనా ప్రజలలో ఏం చేసినా సామూహికంగా చేసే అలవాటు ఉన్న కారణంగా వ్యాధిని త్వరగా అదుపు చేయడాఇకి వీలైంది. చైనా ఏకంగా 93 కోట్ల మంది ప్రజలు ఉన్న చోటనుంచి కదలకుండా, ఇళ్లకే పరిమితం అయ్యారు. అదే విధంగా కోట్లాది మంది ప్రజల బాడీ టెంపరేచర్, వారి పర్యాటక చరిత్రలను చైనా ప్రభుత్వం సేకరించింది. దీని వలన రోగులను గుర్తించడం తేలికౌంది. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడంతో కోట్లాది మందికి భోజనం సరఫరా చేసే పనిని ప్రభుత్వమే చేపట్టింది. ఇవన్నీ చైనాలో మాత్రమే సాధ్యమౌతాయి. వీటి వల్లే వ్యాధి చాలా త్వరగా అదుపులోకి వచ్చింది. చైనాలో ప్రజలందరికీ ట్రావెల్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ కోడ్ ఆధారంగా వారు పర్యటించిన చోట్లు, వారి వ్యాధుల వివరాలను ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది. ముఖాలను గుర్తించే టెక్నాలజీ వల్ల కూడా మాస్కులు ధరించని వారిని గుర్తించి హెచ్చరించడం జరిగింది. ముఖానికి మాస్క్ ధరించకపోయినా, చేతులు సబ్బుతో కడుక్కోక పోయినా, కరోనా వ్యతిరేక నిబంధనలు పాటించకపోయినా పౌరులకు మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకూ జైలు శిక్షను విధించారు.

Also Read : కృష్ణాజిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు

ఈ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కారణంగానే తొలి నాళ్లలో పలు తప్పులు చేసిన చైనా వీలైనంత త్వరలో వ్యాధిపై అదుపును సాధించగలిగింది.

Next Story