చైనాలో కరోనా మృతులకు నివాళిగా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 April 2020 2:40 AM GMT
చైనాలో కరోనా మృతులకు నివాళిగా..

కనపడని శత్రువు తో ఎడతెగని యుద్ధం జరుగుతూనే ఉంది. తన దగ్గర పుట్టినదే అయినా చైనా కూడా జయించలేక పోయిన కరోనా వైరస్ దేశాలు, ప్రాంతాలు, మతాలు, భాషలతో సంబంధం లేకుండా మనషులు అందరినీ తన వెంట తీసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనా దేశంలో కరోనా వైరస్ వల్ల మరణించిన అమరవీరులకు సంతాపం తెలిపేందుకు ఈరోజును జాతీయ సంతాప దినం పాటించాలని చైనా సర్కారు నిర్ణయించింది.

కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ లీ వెన్లీయాంగ్‌తోపాటు 3,300 మందికి పైగా అమరవీరులకు సంతాపం తెలియజేయాలని చైనా సర్కారు ఆదేశించింది. ఈ కరోనా మృతుల సంతాప దినం సందర్భంగా చైనా దేశంతోపాటు విదేశాల్లోని అన్ని చైనా రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాలను అవనతం చేసి ఉంచుతారు.

సంతాప దినం సందర్భంగా దేశంలో అన్ని ప్రజా వినోద కార్యక్రమాలను రద్దు చేశామని సర్కారు ప్రకటించింది. ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా మృతులకు సంతాప సూచకంగా మూడు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. ఈ సందర్భంగా విమానాలు, బస్సులు, రైళ్లు, ఓడల్లో సంతాపసూచకంగా సైరన్ మోగించనున్నారు.

Next Story