రోగ నిరోధక శక్తిని పెంచుకోండిలా..

By రాణి  Published on  3 April 2020 8:32 AM GMT
రోగ నిరోధక శక్తిని పెంచుకోండిలా..

కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలన్నా..ఆ వైరస్ వచ్చిన వారు కోలుకోవాలన్నా ప్రథమంగా కావాల్సింది రోగనిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి వయసు పైబడిన వారిలో, 10 ఏళ్లలోపు చిన్న పిల్లల్లో తక్కువగా ఉంటుంది కాబట్టే వారంతా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు. అలాగని నడివయసు వారికి ఈ వైరస్ రాదన్న నియమమేమీ లేదు. ప్రతిఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి ఉంటేనే ఏ వ్యాధినైనా ఇట్టే జయించగలం. మరి ఏయే ఆహారం తినడం వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువ వస్తుందో తెలుసా ? ఇదిగో ఇది చదివి తెలుసుకోండి.

How To Improve Immunity Power

విటమిన్‌-ఏ

శరీర ఇమ్యూనిటీకి వాహకంగా పని చేయడంలో విటమిన్‌-ఏ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్ల(విష కణాలు)లను, శరీరంలోకి చొరబడిన వైరస్‌లు, బ్యాక్టీరియాలను బయటకు నెట్టివేసేందుకు వ్యాధి నిరోధక వ్యవస్థకు సహాయం చేస్తుంది. క్యారెట్లు, ఆకుకూరలు, చిలగడదుంప, బ్రోకోలి, కాలే(క్యాబేజి కుటుంబానికి చెందిన ఆకుకూర), కీరా, మామిడి పండ్లు, కర్బూజా, ఆప్రిక్యాట్లలో పుష్కలంగా లభించే బీటా కెరోటిన్‌ అనే పదార్థం విటమిన్‌-ఎ గా రూపాంతరం చెందుతుంది.

విటమిన్ సి

కమలాలు, ద్రాక్షల్లో ఉండే విటమిన్ సి రక్తంలోని యాంటీబాడీస్‌ను, తెల్ల రక్తకణాలను వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కమలాలు, ద్రాక్షలతో పాటు కివీ పళ్లు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ, మరియాలు, ఉడికించిన క్యాబేజీ, గోబీ పువ్వుల్లో సి విటమిన్ లభిస్తుంది.

విటమిన్ డి

గుడ్లు, పాలల్లో ఉండే విటమిన్ డి రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే ప్రోటీన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది. విటమిన్ డి..తిండి రూపంలోనే కాకుండా ఉదయాన్నే వచ్చే సూర్య రశ్మి నుంచి కూడా లభిస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉన్నవారు..చేపలు, గుడ్లు, పాలు, చీజ్‌, వెన్న, పన్నీరు, పుట్టగొడుగులను తినడం ద్వారా పొందవచ్చు.

జింక్

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది జింక్. దీని ద్వారానే వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. పౌల్ట్రీ ఉత్పత్తులు, జంతు మాంసం, సోయాబీన్‌, శనగలు, చిక్కుళ్లు, చిరు ధాన్యాలు, గింజలు, చీజ్‌, పన్నీరు, యోగర్ట్‌ వంటివాటిలో జింక్ ఎక్కువగా లభిస్తుంది. చిన్న పిల్లలకు ఇలాంటివి పెట్టడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ప్రొటీన్లు

జంతు, వృక్షాల నుంచి లభించే పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే కణాలు, యాంటీబాడీస్‌ను వృద్ధి చేయడంలో ప్రొటీన్ల పాత్ర కీలకం. వేయించిన శనగలు తరచూ తింటుండటం వల్ల ప్రొటీన్లు ఎక్కువగా లభిస్తాయి. గుడ్లు, చేపలు, మాంసం, పప్పు ధాన్యాలు, గింజలు, విత్తనాలు, పాలు, యోగర్ట్‌ వంటి పదార్థాలను మన తినే భోజనంతో పాటు కలిపి తీసుకోవడం మంచిది.

ముఖ్యంగా పోషకాహారంతో పాటుగా ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. అరటిపండ్లు, బ్రెడ్ తింటూనే వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటాం.

Also Read : ఆమె 26 ఏళ్లుగా క్వారంటైన్ లోనే.. ఎందుకంటే

Next Story