చైనాకు చుక్కలు చూపిస్తున్న భారత్
By సుభాష్ Published on 5 Sep 2020 3:21 AM GMTదేశ భధ్రతను దృష్టిలో ఉంచుకుని డిజిల్ రంగాన్ని దెబ్బకొట్టేలా చైనాపై ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. చైనాకు చెందిన పబ్జీతో పాటు మరో 118 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధిస్తూ కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ గత బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్‌లో తొలిసారి 59 యాప్‌లు, ఆ తర్వాత 47 యాప్‌లనుని నిషేధించిన కేంద్రం.. తాజాగా 118 యాప్‌లను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చైనాకు చెందిన యాప్‌ల నిషేధం సంఖ్య 226కు చేరింది. అయితే యువతలో ఎక్కువగా ఆదరణ పొందిన ప్రముఖ గేమింగ్ యాప్ పబ్‌జీ కూడా నిషేధిత జాబితాలో ఉండటం పెద్ద దెబ్బేనని చెప్పాలి. దీంతో మన దేశంలో సెలఫోన్లు, ట్యాబ్‌లలో ఈ ఆటను ఆడటం ఇక వీలు కాదు. దేశ సార్వభౌమత్వం, రక్షణకు ముప్పుగా పరిణమిస్తుండటంతో ఆ యాప్‌లపై వేటు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఈ ఏడాది జూన్ 29న 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. అనంతరం వాటి నకళ్లుగా పని చేస్తున్న మరో 47 యాప్‌లను గుర్తించి కొరఢా ఝులిపించింది. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ నిషేధంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, భారత్ - చైనా సరిహద్దు లడఖ్‌లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల్లో కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో కూడా లడఖ్ సరిహద్దు వద్ద గల్వాన్ లోయలో ఘర్షణలు తలెత్తినప్పుడు టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ జూన్ 29న రాత్రి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. అప్పుడు నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనాకు సంబంధించిన యాప్‌లు ఉన్నాయి.
యాప్‌ల సహాయంతో వివరాలు దొంగిలించి..
ఈ యాప్‌ల సహాయంతో వివరాలు దొంగిలించి భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు అందజేస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చాయని కేంద్రం తెలిపింది. దీంతో భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తుందనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్ననిర్ణయం చైనాకు పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పాలి.
మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా..
కాగా, గత కొంత కాలంగా చర్చల పేరుతో సైలెంట్‌గా ఉన్న చైనా మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది. లడఖ్‌లోని వాస్తవాదీన రేఖ దగ్గర యధాథదంగా స్థితిని ఉల్లంఘిస్తూ దురాక్రమణకు పాల్పడుతోంది. ఆగస్టు 29 ఘటన నేపథ్యంలో భారత్ - చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భారత్ జవాన్లు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఖంగుతిన్న చైనా కాళ్ల బేరానికి వస్తోంది. రక్షణ మంత్రి స్థాయిలో చర్చలు జరుపుదామంటూ చైనా ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే డ్రాగన్ కుట్రను గుర్తించిన భారత ప్రభుత్వం.. ఈ చర్చలకు ఇంత వరకు సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం మిలటరీ స్థాయిలో చర్చలకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే వెల్లడించారు. సరిహద్దుల్లో సైన్యం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. గత మూడు నెలలుగా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ నరవణే శుక్రవారం లడఖ్‌లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.