దగ్గు మందు తాగి 9 మంది చిన్నారులు మృతి

By సుభాష్  Published on  21 Feb 2020 7:27 AM GMT
దగ్గు మందు తాగి 9 మంది చిన్నారులు మృతి

ముఖ్యాంశాలు

► దగ్గుమందులో విష పదార్థం కలిసినట్లు గుర్తింపు

► సరఫరా చేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ కంపెనీ

► మందులో ప్రైమా ఫేసీ', డై ఇథిలీన్‌ గ్లైకాల్‌' విష పదార్థాలు

► 8 రాష్ట్రాల్లో తయారీ కంపెనీల మూసివేత

జమ్మూకశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. దగ్గుమందు తాగి 9 మంది చిన్నారులు మృతి చెందారు. దగ్గుమందు కావాల్సి ఉండటంతో గత నెల రోజుల కిందట హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ కంపెనీ ఈ మెడిసిన్‌ను జమ్మూలోని ఉదంపూర్‌ జిల్లా చిన్నారులకు సరఫరా చేసింది. అందులో పాయిజన్‌ కాంపౌండ్‌ కలిసి ఉండటంతో ఈ మందును తాగిన 17 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే చిన్నారులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నచిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో 9 మంది మరణించారు.

ఇందులో 'ప్రైమా ఫేసీ', డై ఇథిలీన్‌ గ్లైకాల్‌' అనే రెండు విష పదార్థాలు కోల్డ్‌ బెస్ట్‌ పీసీ టానిక్‌లో కలిసినట్లు అధికారులు గుర్తించారు. వీటి కారణంగా ఉదంపూర్‌, ఛండీఘర్లోని చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని డ్రగ్‌ అండ్‌ ఫుడ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ వెల్లడించారు. ఈ దగ్గు మందులో విష పదార్థాలు కలవడం వల్ల చిన్నారుల ఊపిరితిత్తులు చెడిపోయి మృతి చెంది ఉండవచ్చని డైరెక్టర్‌ హెల్త్‌ సర్వీస్‌కు చెందిన డాక్టర్‌ రేణు శర్మ పేర్కొన్నారు.

ఉత్పత్తుల నిలిపివేత

ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తులు జరుగుతున్న 8 రాష్ట్రాల్లో మొత్తం 5వేల 500 మందు బాటిళ్లను సీజ్‌ చేశారు. తయారీ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు అధికారులు వివరించారు. ఈ కంపెనీ మందులు సప్లై అయ్యే రాష్ట్రాలైన హర్యానా, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, మేఘాలయ, త్రిపురాలో తనిఖీలు చేపట్టనున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Next Story