చిలకలగూడ బాలిక హత్య కేసు: నిందితున్ని గుర్తించిన పోలీసులు..!

By సుభాష్  Published on  24 Jan 2020 9:01 AM GMT
చిలకలగూడ బాలిక హత్య కేసు: నిందితున్ని గుర్తించిన పోలీసులు..!

సికింద్రబాబాద్ లోని చిలకలగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో వారాసిగూడలో శుక్రవారం 17 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. రెండు అపార్ట్‌ మెంట్ల మధ్య పడివున్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై రక్తపు మరకలు గుర్తించారు. సంఘటన స్థలానికి క్లూస్‌ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. గతకొద్ది రోజులుగా షోయబ్ అనే యువకుడు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని హింసిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ముందు తెలిపినట్లు తెలుస్తోంది. బాలిక నివాసం ఉంటున్న భవనం నుంచి కిందికి తోసేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటన స్థలంలో సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్య చేసే ముందు బాలికపై అత్యాచారం జరిగిందా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కొద్ది రోజులు కిందట పెళ్లి సంబంధం గురించి అతడి కుటుంబ సభ్యులు వచ్చి బాలిక కుటుంబీకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా, ఆమె మైనర్‌ కావడం, చదువుకుంటుందని, ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని చెప్పడంతో, బాలిక తనకు దక్కదనే ఉద్దేశంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

నిందితుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, భవనంపై రక్తపు మరకలు కనిపించడంతో నిందితుడు బాలికను హింసించి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే అసలైన నిజాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Next Story
Share it