కొడుకు మతం మార్చిన మహిళపై పోలీస్ కేసు

By రాణి  Published on  24 Jan 2020 7:46 AM GMT
కొడుకు మతం మార్చిన మహిళపై పోలీస్ కేసు

ముఖ్యాంశాలు

  • భర్త అనుమతి లేకుండా కొడుక్కి బాప్టిజం ఇప్పించిన హిందూ మహిళ
  • గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఘటన
  • ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్ కింద కేసు నమోదు
  • ఎనిమిదేళ్ల తర్వాత విచారణ ముగింపు
  • చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసు పెట్టాలని ఆదేశాలు

గుజరాత్ లో ఎనిమిదేళ్ల క్రితం కలెక్టర్ అనుమతి లేకుండా తన బిడ్డకు ఓ స్థానిక చర్చ్ లో బాప్టిజం ఇప్పించినందుకు ఎనిమిదేళ్ల తర్వాత ఓ హిందూ మహిళపై గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్ కింద కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించి 2013లో ఆనంద్ జిల్లా కలెక్టరేట్ లో ధర్మేంద్ర రాథోడ్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్కడి పోలీసులు ఇప్పుడు స్పందించి కేసు నమోదు చేశారు. ఆనంద్ రాథోడ్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్నారు. భర్త నుంచి విడిపోయిన ఆ మహిళ తన బిడ్డకు బాప్టిజం ఇప్పించే విషయంలో భర్త అభిప్రాయాన్ని, అనుమతినీ అలాగే ఆనంద్ జిల్లా కలెక్టర్ అనుమతిని తీసుకోలేదనీ ధర్మేంద్ర రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఆరు సంవత్సరాలుగా విచారణ జరుగుతోంది. ఆనంద్ జిల్లా కలెక్టర్ ఆర్.జి.గోహిల్ విచారణ పూర్తి చేసి జనవరి 23, 2020న దీనిపై నిర్ణయం తీసుకుని ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

2003లో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన గుజరాత్ ప్రభుత్వం

సదరు మహిళ తన భర్త అనుమతిని, అలాగే జిల్లా కలెక్టర్ అనుమతిని తీసుకోకుండా తన పిల్లాడికి బాప్టిజం ఇప్పించడం గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రెలిజియన్ యాక్ట్ ని ఉల్లంఘించడమేనని జిల్లా కలెక్టర్ విచారణ నివేదికలో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా, ఒత్తిడిచేసి, ఆశచూపి, ఇతరత్రా మోసపూరితమైన మార్గాల్లో మత మార్పిడి చేయడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ 2003లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. అక్కడి మానవహక్కుల కార్యకర్తలు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం విచారణను ఎదుర్కుంటున్న మహిళ తన బిడ్డను తీసుకుని ఏప్రియల్ 8, 2012లో స్థానికంగా ఉన్న చర్చ్ కి వెళ్లి అక్కడి ప్రీస్ట్ ని తన బిడ్డకు బాప్టిజం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించినట్టు తెలుస్తోంది.

తల్లికి అండగా నిలచిన మానవ హక్కుల కార్యకర్తలు

పిల్లలు ప్రత్యేకంగా మతాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదనీ, తల్లిదండ్రుల మతమే పిల్లలకూ వర్తిస్తుందనీ, కేవలం తన బిడ్డకు బాప్టిజం ఇప్పించిందన్న కారణంతో ఆ మహిళపై విచారణ జరపాల్సిన పనిలేదనీ, శిక్షించాల్సిన పనిలేదనీ మానవ హక్కుల కార్యకర్తలు ఆమె తరఫున వాదిస్తున్నారు. నిజానికి మైనర్లకు మత మార్పిడి చేసుకునే అవకాశం, అధికారం రెండూ లేవని చట్టం చెబుతోంది. మేజర్ అయిన తర్వాత ఎవరిష్టం వచ్చిన మతాన్ని వాళ్లు అవలంబించే స్వేచ్ఛను భారత రాజ్యాంగం పౌరులందరికీ కల్పించింది. బాప్టిజం తీసుకున్న బాలుడి తల్లిదండ్రులిద్దరూ హిందువులే కనుక, వాళ్లిద్దరూ విడివిడిగా బతుకుతున్నారు కనుక, సదరు మహిళ తన పిల్లాడికి బాప్టిజం ఇప్పించే ముందు కచ్చితంగా తన భర్త అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తల్లిదండ్రుల మతమే పిల్లల మతం కనుక, మైనర్లు మతం మారడానికి వీల్లేదుకనుక, ఏవో ప్రలోభాలకు లేదా ఒత్తిడులకు లోబడి ఆ తల్లి తన పిల్లాడికి బాప్టిజం ఇప్పించిందనీ పిటిషనర్ రాథోడ్ వాదిస్తున్నారు.

మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా

పిల్లవాడి తల్లిదండ్రులు 2001లో పెళ్లి చేసుకుని 2008లో విడాకులు తీసుకున్నారు. తన పిల్లాడికి తన మాజీ భార్య బాప్టిజం ఇప్పించిందన్న విషయం తెలియగానే ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన హిందూ ఓబీసీ అయిన తండ్రి దాన్ని ఛాలెంజ్ చేస్తూ నేరుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు 2013లో లేఖ రాశాడు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ తండ్రి రాసిన లేఖను నేరుగా గుజరాత్ చీఫ్ సెక్రటరీకి పంపించింది. కానీ దానిపై నాటి గుజరాత్ చీఫ్ సెక్రటరీ ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఆనంద్ జిల్లా కలెక్టర్ దానిపై విచారణ పూర్తి చేసి గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రెలిజియన్ యాక్ట్ లోని 3, 4 సెక్షన్ల ప్రకారం ఎప్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించారు. సదరు మహిళపై నేరం రుజువైన పక్షంలో గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రెలిజియన్ యాక్ట్ ని ఉల్లంఘించినందుకు ఆమెకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కాస్త ఆలస్యం అయినా తనకు, తన బిడ్డకు న్యాయం జరుగుతోందని పిల్లాడి తండ్రి భావిస్తున్నాడు. తల్లిమాత్రం తనకసలు ఏపాపం తెలియదనీ తనపై నేరం మోపడం న్యాయం కాదని అంటోంది.

Next Story