ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య

By సుభాష్  Published on  7 March 2020 6:39 AM GMT
ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య

సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు. ఆయన భార్య శుక్రవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న కేశవులు భార్య గురువారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా, శుక్రవారం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, దిశ అత్యాచారం, హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న చెన్నకేశవులుది నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. స్థానికంగా ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌ 6న షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అప్పటికి భార్య ఆరు నెలల గర్భవతి. పోలీసులు తన భర్తను అన్యాయంగా చంపేశారని ఆరోపించింది. తనకు ఎవరు దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు పాల్పడిన మృగాళ్లకు తగిన గుణపాఠం జరిగిందని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పేర్కొన్న విషయం తెలిసిందే.

చెన్నకేశవులు భార్య మైనర్‌

ఇక దిశ కేసులో నిందితుడైన చెన్న కేశవులు భార్య మైనర్‌ అని అధికారులు తేల్చారు. ఆమె వయసు 13 సంవత్సరాలేనని తెలిపారు. ఆమె పుట్టిన తేదీ 2006 జూన్‌ 15గా రికార్డుల ద్వారా అధికారులు గుర్తించారు. ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధికారులు తెలుపగా, అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. చెన్నకేశవులు భార్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బాబాయి, నానమ్మ సంరక్షణలో పెరిగింది. ఆమెకు ఓ చెల్లెలు, ఓ తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె బాబాయి ఇంట్లో ఉంటోంది.

Next Story