బాబోయ్..వీళ్లు చార్మినార్ నే అమ్మేసేవారు..

By రాణి  Published on  4 Feb 2020 9:31 AM GMT
బాబోయ్..వీళ్లు చార్మినార్ నే అమ్మేసేవారు..

“బాబోయ్ వీడు అసాధ్యుడురా... మనల్ని నిలబెట్టి బజార్లో అమ్మేస్తాడురా” అని మనం కొందరు మహా నగరంలోని మాయగాళ్ల గురించి చెబుతూంటాం. నిజంగానే వాళ్లు ఒకే ప్లాట్ ను పది మందికి అమ్మేసి, “తాంబూలాలిచ్చేశాం... తన్నుకుచావండి” అంటూ తలో దిక్కుకు జారుకుంటారు. ఆ తరువాత కాసులు వాళ్లకు... కేసులు మనకు...

ఇటీవల చెన్నైలో ఇలాంటి అఖండులు ముగ్గురు కలిసి ఏకంగా ఒక హోటల్ నే రూ. 165 కోట్లకు అమ్మేసేందుకు సిద్ధపడ్డారు. ఆ హోటల్ వాళ్లది కాదు. అమ్ముతున్నట్టు యజమానికి తెలియదు. కొంటున్న వాళ్లకి యజమానెవరో తెలియదు. ఇంతా చేసి డీల్ అంతా సెట్ చేసింది తాము అమ్మబోతున్న హోటల్ లాబీలో కూర్చునే! అదే హోటల్లో కూర్చుని డీల్ చేసి వాళ్లకు తెలియకుండా అదే హోటల్ ను అమ్మేయడమంటే వీరు నిజంగా “కృష్ణుడి వారసులే” మరి!! కొద్దిలో తప్పిపోయి ప్లాన్ బయటపడింది. సూత్రధారులు కృష్ణ జన్మస్థానంలో కటకటాలు లెక్కబెడుతున్నారు. 70 ఏళ్ల కరుణాకరన్, 55 ఏళ్ల పరమానందం, 60 ఏళ్ల దక్షిణా మూర్తిలు చెన్నైలోని సుప్రసిద్ధ అంబికా ఎంపైర్ హోటల్ ను కేరళకు చెందిన ఒక గ్రూప్ కు అమ్మేసే ప్రయత్నం చేశారు.

ఒకరు హోటల్ జనరల్ మేనేజర్, ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్, మరొకరు సీనియర్ మేనేజర్ గా అవతారమెత్తి హోటల్ యజమాని భయంకరమైన ఆర్ధిక సమస్యల్లో ఉన్నారని, అందుకే హోటల్ ను అయిన కాడికి అమ్మేయమని తమకు అధికారమిచ్చాడని కేరళకు చెందిన ఒక కంపెనీని నమ్మించారు. యజమాని తమకు అధికారమిస్తున్నట్టు పత్రాలు కూడా చూపించారు. చివరికి కేరళ కంపెనీ రూ. 165 కి కొనేందుకు సిద్ధమైంది. ముందుగా అడ్వాన్స్ గా ఒక పది శాతం తమకు ఇవ్వమని వారు డిమాండ్ చేశారు. ఈ లావాదేవీలన్నీ హోటల్ లాబీస్ లో కూర్చునే చేశారు. తమాషా ఏమిటంటే కేరళ నుంచి వచ్చిన వారికి అదే హోటల్ లో రూములు కూడా బుక్ చేశారు.

అయితే లాబీల్లో కేరళ గ్రూపు, మన ముగ్గురు మొనగాళ్ల మధ్య జరుగుతున్న చర్చలు చూసి ఒక ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఆయన అదే హోటల్లో ఉన్న యజమానికి విషయం చేరవేశాడు. యజమాని సుధాకరన్ ఖంగు తిన్నాడు. తక్షణం వడపళని పోలీసులకు ఫోన్ చేశాడు. సరిగ్గా డీల్ ను సీల్ చేసేసే సమయంలో పోలీసులు ప్రత్యక్షమవడంతో ముగ్గురు మాయగాళ్లు బుక్కైపోయారు. అలా హోటల్ అమ్మకం ఆగిపోయింది. యజమానికి తెలియడం కాస్త ఆలస్యం అయితే కథ “భజగోవిందం... పరమానందం” అయిపోయి ఉండేది.

ఇప్పుడు పోలీసులు సదరు మాయగాళ్లు ఇలాంటి అమ్మకాలు ఇదివరకు కూడా చేశారా అని, వారి గత చరిత్ర ఏమిటని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. బాబోయ్ వీళ్లు దొరికిపోయారు కానీ ఏదో ఒక రోజు చార్మినార్ నే అమ్మేసేవారు!!

Next Story
Share it