స్వగృహానికి చరితారెడ్డి భౌతికకాయం
By Newsmeter.Network Published on 5 Jan 2020 6:44 AM GMTఅమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చరితారెడ్డి భౌతికకాయం హైదారాబాద్‌లోని నేరేడ్మెట్లోని రేణుకానగర్‌కు చేరుకుంది. బరణీకాలనీలో ఉన్న శ్మశాన వాటికలో చరితారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. చరితారెడ్డి భౌతికకాయాన్ని చివరిసారిగా చూసేందుకు బంధువుల, చుట్టు ప్రక్కల వాళ్లు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి వచ్చారు. 2019 డిసెంబర్ 27వ తేదీన మిచిగాన్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి చరితా రెడ్డి (26) టయోటా కామ్రీ కారులో ప్రయాణిస్తుండగా.. వెనుక నుండి వేరే కారులో వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి బలంగా కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరితారెడ్డి కోమలోకి వెళ్లింది. అనంతరం చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయ్యింది. చరితా రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలిచేందుకు స్నేహితులు చేయి చేయి కలిపి క్రౌడ్ ఫండింగ్ చేశారు.
ప్రాథమిక విధ్యాబ్యాసమంతా నేరేడ్‌మెట్‌లోనే చదివిన చరితా రెడ్డి.. గీతం కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. అనంతరం 2015లో ఆమె ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన చరితారెడ్డి ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో తిరిగి అమెరికా వెళ్లింది. మూడేళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తుంది. ఈ హఠాత్తు పరిణామంతో నిండు జీవితాన్ని రుచి చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపిన చరితారెడ్డి.. తన అవయవాలను దానం చేసి మరో తొమ్మిది కొత్త జీవితాలకు వెలుగులు నింపింది. చరితా రెడ్డి కుటుంబ సభ్యుల పర్మిషన్తో ఆమె అవయవాలను వైద్యులు డొనేట్ చేశారు. ఈ సందర్భంగా చరితారెడ్డి కుటుంబ సభ్యులకు అక్కడి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో చరితారెడ్డి త్యాగాన్ని అక్కడి సమాజం కీర్తిస్తోంది.