చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ - అంబటి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 10:38 AM GMT
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ - అంబటి

విజయవాడ: సీఎం జగన్‌పై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అనవసర విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌పై కేసులు విచారణ జరుగుతుంటే నేరస్తుడు అని ఎలా అంటారని అంబటి ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నా వారందరూ నేరస్తులు కాదని.. వేల పుస్తకాలు చదివానంటున్న పవన్‌ కల్యాణ్‌ ఈ విషయం తెలుసుకోవడం మంచిదన్నారు. సీఎం జగన్‌ను ఎదుర్కొనలేక సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి తప్పుడు కేసులు పెట్టారన్నారు. చీకట్లో చంద్రబాబు చిదంబరం కాళ్లు పట్టుకొని.. వైఎస్‌ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టారని అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. సీబీఐ కేసులతో జగన్‌ను బెదిరించాలని చూశారని.. కానీ కేసులకు భయపడని వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని అంబటి అన్నారు. 16 నెలలు జైల్లో అన్యాయంగా పెట్టిన బెదరని వ్యక్తి జగన్‌ అని అన్నారు. ఒక పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి మద్దుతుగా జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్‌ పెట్టారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది నిజమా.. కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు డీఏన్‌ఏ పవన్‌ కల్యాణ్‌ డీఏన్‌ఏ ఒకటే కాబట్టి ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు.

ప్రకాశం జిల్లాలో వలసలు సంగతి పక్కన పెడితే పవన్‌ కల్యాణ్‌ తన సొంత పార్టీలో వలసలు ఆపుకోవాలని సూచించారు. రెండు చోట్ల పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు ఉదయం మాట్లాడింది.. పవన్‌ కల్యాణ్‌ సాయంత్రం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ సొంతంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలన్నారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్‌ కల్యాణ్‌.. తాను ఓడిపోయిన చోట ఇప్పటి వరకు మొహం చూపించలేదని వైసీపీ నేత అంబటి అన్నారు. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ లాలూచీ రాజకీయాలు మానుకోవాలన్నారు. కుప్పం, మంగళగిరిలో చంద్రబాబు, లోకేష్‌పై పోటీ ఎందుకు పెట్టలేదని పవన్‌ను అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబుని నమ్ముకొని వపన్‌ కల్యాణ్‌ రాజకీయాలు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు.. సొంతంగా రాజకీయాలు చేస్తే నాలుగు సీట్లు అయిన పవన్‌ కల్యాణ్‌ దక్కుతాయని అంబటి అన్నారు. గతంలో పోటీ చేయకుండా చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్న పవన్‌ కల్యాణ్‌ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు సీఎం కావాలని పవన్‌ కల్యాణ్‌ కోరుకున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు.

విభజన హామీల అమలుపై కేంద్రమంత్రి అమిత్‌ షాను సీఎం జగన్‌ కలిశారని వైసీపీ నేత అంబటి పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌పై అమిత్‌షాకు సీఎం జగన్‌ వివరించారన్నారు. రివర్స్‌ టెండరింగ్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ని అమిత్‌ షా అభినందించారని అంబటి తెలిపారు. రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం సీఎం వైఎస్‌ జగన్‌ బాధ్యత అన్నారు.

Next Story
Share it