బాబు మార్కు కసరత్తు.. సరికొత్త శక్తితో నూతన నాయకత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jun 2020 7:01 AM GMT
బాబు మార్కు కసరత్తు.. సరికొత్త శక్తితో నూతన నాయకత్వం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయ వ్యూహాల అమలులో చేయి తిరిగిన నేతే. అయితే ఎందుకనో గానీ... 2014 ఎన్నికల తర్వాత టీడీపీ బలోపేతంపై ఆయన అంతగా దృష్టి సారించలేకపోయారు. అయితే 2019 ఎన్నికల్లో ఎదురైన గుణపాఠంతో తనలో దాగి ఉన్న నాయకత్వ పటిమకు మళ్లీ పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఓ వైపు అధికార పార్టీ వైసీపీ దాడులకు ఎదురొడ్డుతూనే టీడీపీకి పెట్టని కోటగా నూతన నాయకత్వాన్ని తీర్చిదిద్దే పనిలో చంద్రబాబు ఇప్పుడు బిజీగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాబు మార్గదర్శకత్వంలో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న నాయకత్వానికి వ్యాపార బలహీనత అన్న మాటే వినిపించదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఏ రాజకీయ పార్టీకి అయినా ఇలాంటి క్వాలిటీ కలిగిన నాయకత్వమే కావాలి. అయితే మెజారిటీ పార్టీలు దీనిని అంతగా పట్టించుకోవడం లేదు. గతంలో ఈ తరహా నాయకత్వానికి కొదవ లేని టీడీపీ అప్రతిహాతంగానే ప్రస్థానం సాగించింది. అయితే కాలక్రమేణా వ్యాపార బలహీనత లేని నాయకులు కనుమరుగు అయ్యారు. ఫలితంగా టీడీపీకి కూడా ఇప్పటికే దెబ్బ పడిపోగా... మరిన్ని దెబ్బలు కూడా తప్పవన్న వాస్తవాన్ని చంద్రబాబు ఇప్పటికే గుర్తించారు. అయితే పార్టీ భవిష్యత్తుపై గత కొంత కాలంగా తీవ్రంగా ఆలోచన చేసిన చంద్రబాబు... వ్యాపార బలహీనత లేని కొత్త నాయకత్వం అవసరాన్ని గుర్తించారు. ఇప్పుడు ఆ తరహా కొత్త నాయకత్వాన్ని తయారు చేసే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు.

2014 ఎన్నికల్లో విజయం తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు... రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న ఏపీని గాడిన పట్టే పనికే ప్రాధాన్యమిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన చంద్రబాబు. టీడీపీ పటిష్టతపై అంతగా దృష్టి సారించలేకపోయారు. అంతేకాకుండా నాడు విపక్షంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అధికార టీడీపీ ఎమ్మెల్యేలను లాగేస్తానని ప్రకటించడంతో ఒకింత ఆలోచనలో పడిపోయిన చంద్రబాబు... తానే ఆ పనిని ప్రారంభించేసి జగన్ కు గట్టి షాకే ఇచ్చారు. అయితే ఈ చర్య మున్ముందు తన పార్టీకి దెబ్బేస్తుందని చంద్రబాబు గ్రహించలేకపోయారు.

తాజాగా అదికారంలోకి వచ్చిన వైసీపీ టీడీపీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలను లాగేసే పని ప్రారంభించడంతో... ఈ తరహా ముప్పు మున్ముందు ఎదురు కాకూడదంటే ఏం చేయాలన్న దిశగా చంద్రబాబు ఆలోచించారు. ఈ క్రమంలోనే వ్యాపార బలహీనత లేని నాయకత్వం అవసరతను చంద్రబాబు గుర్తించారు. ప్రస్తుతం పార్టీ వీడిన కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరి.. తాజాగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావులు వ్యాపార బలహీనతతోనే పార్టీ మారారన్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఇక పార్టీలో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న నాయకత్వానికి ఆ బలహీనత ఉండరాదన్న నిర్ణయానికి వచ్చారు. ఆ వెంటనే వ్యాపార బలహీనత అన్న మాటే వినిపించని రీతిలో కొత్త నాయకత్వాన్ని రూపొందించే పనిలో చంద్రబాబు మునిగిపోయారు. బాబు కసరత్తు ముగిస్తే... టీడీపీ తిరుగులేని శక్తిగా మారుతుందని చెప్పొచ్చు.

Next Story