చంద్రబాబుకే హై సెక్యూరిటీ.. 183 మందితో..

By అంజి  Published on  19 Feb 2020 7:11 AM GMT
చంద్రబాబుకే హై సెక్యూరిటీ.. 183 మందితో..

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదని ఏపీ డీజీపీ కార్యాలయం వెల్లడించింది. దేశంలోనే అత్యంత హై-సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీలో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 183 మందితో భద్రత కల్పిస్తున్నామని డీజీపీ ఆఫీస్‌ తెలిపింది. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో భద్రత కల్పిస్తున్నామని వివరించింది.

కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు భద్రత అంశం ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంది. చంద్రబాబుకు భద్రత కుదించడంపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. దీని వెనుక వైసీపీ ప్రభుత్వం కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నాయి. చంద్రబాబుకు నక్సలైట్ల నుంచి ముప్పు ఉండడంతో జడ్‌ప్లస్‌ సెక్యూరిటిని కల్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబుకు భద్రతను కుదించారు. ఈ విషయమై టీడీపీ కోర్టు మెట్లెక్కింది. అయితే 97 మంది భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపింది.

తాజాగా ఇంటెలిజెన్స్‌ విభాగం ఐజీ రాసిన లెటర్‌ ప్రకారం.. ఆ సంఖ్యను 58కి తగ్గించనున్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు పూర్వపు భద్రతను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఏమైనా హాని జరిగితే దానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నామని ఆయన అన్నారు. భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్న వారి విషయంలో రాజకీయంలో కోణంలో వ్యహరిస్తూ.. భద్రతను కుదించడం దారుణమని కళా వెంకట్రావు అన్నారు.

Next Story