ఆ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు

By సుభాష్  Published on  8 April 2020 6:02 AM GMT
ఆ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు వాడివేడిగానే కొనసాగుతాయి. పాలక పక్షాలు, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. నువ్వా.. నేనా.. అన్నట్లుగానే వ్యవహరిస్తుంటారు నేతలు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎటు చూసినా కరోనా గురించే. ఈ మహ్మమ్మారి వల్ల ప్రభుత్వాలు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అయినా ఏపీలో మాత్రం రాజకీయ నేతల మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది.

చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలంటారు పెద్దలు. అందుకే పెద్దమాటను తప్పకుండా ఆచరిస్తున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓ టీడీపీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని, తర్వాత వదిలేసిన పోలీసులపై చంద్రబాబు నాయుడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఎవరి వద్దకు వెళ్లకుండా ఏకంగా గవర్నర్‌ వద్దకే వెళ్లింది. ఈ మేరకు మంగళవారం చంద్రబాబు గవర్నర్‌కు లేఖ రాశారు.

రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరితే తమ ఎమ్మెల్యేను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతుల సమస్యలపై కలెక్టర్‌ ఫోన్‌లో స్పందించకపోవడంతో నేరుగా వెళ్లి కలవాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు భావించారని, కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో మా ఎమ్మెల్యేను భీమవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో నర్సాపురం, భీమవరం వైసీపీ ఎమ్మెల్యేలు వందలాది మందితో సమావేశం నిర్వహించారని, వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలు అంటే అందరికి ఒకేలా ఉండాలని, కేవలం విపక్షాలకేనా.. అధికార నేతలకు లేవా .. అని చంద్రబాబు ప్రశ్నించారు.

మంత్రి, కలెక్టర్‌ కూడా దాదాపు రెండు వందల మందితో సమావేశం నిర్వహిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రైతు సమస్యలపై పోరాడుతున్న టీడీపీ నేతలపై, ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

Next Story