మూడు రాజధానుల వెనుక రహస్యం ఏంటో చెప్పిన చంద్రబాబు
By సుభాష్ Published on 23 Dec 2019 9:13 PM ISTసీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు ప్రకటించడం వెనుక ఉన్న రహస్యం తనకు తెలుసని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం చంద్రబాబు తుళ్లూరులో పర్యటించారు. వివిధ ప్రాంతాల మధ్య చిక్కులు పెట్టి, పబ్బం గడుపుకోవడమే మూడు రాజధానుల వెనుక ఉన్న అసలైన రహస్యమని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. ఈ మాటలు విన్న తుళ్లూరు రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉండాలని జిఎన్ రావు కమిటీ ప్రతిపాటించినప్పటి నుంచి ఆందోళన చేస్తున్న రైతులకు చంద్రబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తుళ్లూరులో నిరసన తెలుపుతున్న రైతులను కలిసిన చంద్రబాబు మాట్లాడారు.
రాష్ట్రంలో సచివాలయాలు, అసెంబ్లీ భవనాలు కట్టినంత మాత్రన అభివృద్ధి జరగదని, పరిశ్రమలు, పెట్టుబడులు రావల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో తుఫాను వచ్చినప్పుడు శ్రీకాకుళం, విశాఖపట్టణాల్లో నాలుగు రోజుల పాటు ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించానని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, ఇలా మూడు రాజధానులు ఏ రాష్ట్రానికి లేవని, రాజధానుల పేరుతో జగన్ చిచ్చురేపుతున్నాడని ఆరోపించారు. అమరావతి ఒక ఎస్సీ రిజర్వుడు నియోజవర్గమని, ఆ ప్రాంత ప్రజలను, అమరావతి ఒక చారిత్రాత్మక నగరమని, అందుకే రాజధానిగా ఎంపిక చేశామన్నారు. గతంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో రాజధానిని ప్రకటించిన తర్వాత మళ్లీ మూడు రాజధానులు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ రాజధానులకంటే ముందు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు పలికారు. తమ హయాంలో రాష్ట్ర అభివృద్ధి సాఫీగా జరిగిందని, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చురేపే పనులు ఎక్కువవుతున్నాయని మండిపడ్డారు. జగన్ ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.