ప్రజలను మళ్లీ మోసం చేయలేరు

By రాణి  Published on  25 Jan 2020 3:03 PM IST
ప్రజలను మళ్లీ మోసం చేయలేరు

ముఖ్యాంశాలు

  • 1984 పోరాటాన్ని గుర్తు చేశారన్న చంద్రబాబు
  • మండలిని రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్న యనమల

ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చురకలంటించారు. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే విషయంలో ఒకసారి మోసపోయారు గానీ..పదే పదే ప్రజలు మోసపోరని, వారిని మోసం చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల గుండెల్లో నుంచి టీడీపీని తుడిపేయడం అసాధ్యమన్నారు. మండలిలో టీడీపీ నేతలు చేసిన పోరాటం 1984 పోరాటాన్ని గుర్తుచేసిందన్నారు. 1984లో టీడీపీ చేసిన ధర్మ పోరాటాన్ని ప్రపంచమంతా అభినందించిందని, ఇప్పుడున్న ఎమ్మెల్సీలకు మళ్లీ అలాంటి అవకాశం దక్కిందన్నారు. త్యాగాలు చేసిన వారే చరిత్రలో మిగులుతారు...బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగిన వారు మరుగున పడిపోతారని ఆయన హితవు పలికారు. కౌన్సిల్ సభ్యులందరికీ యనమల ధ్వజస్తంభంలా నిలబడ్డారని చంద్రబాబు కొనియాడారు.

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారంలో ఉన్న మంత్రులపై విరుచుకుపడ్డారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా మధ్యలోనే ఆపేశామని అసత్య ప్రచారాలు చేస్తున్నవారికి బుర్రుందా ? లేదా ? మనం డెమొక్రసీలో ఉన్నామా ? లేక జగన్ కసిలో ఉన్నామా ? అని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికార పార్టీ రాష్ర్టంపై భస్మాసుర హస్తాన్ని ప్రయోగిస్తుందని విమర్శించారు. అలాగే మండలి రద్దుపై తీర్మానం మాత్రమే రాష్ర్టం చేస్తుందని, మండలి రద్దుకు రాష్ర్ట ప్రభుత్వానికి అధికారమే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Next Story