బీజేపీకి సైగ చేస్తున్న చంద్రబాబు..?!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2019 5:39 PM GMT
"నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు" అని ఓ సామెత ఉంది. ఆ సామెత విన్నప్పుడల్లా కొంత మంది గుర్తొస్తుంటారు. అంటే..రాజకీయాల్లో సిద్దాంతాలు, విలువల్లేని నేతలు అన్నమాట. రాజకీయ అవసరాలు, సమీకరణలే పరమావధిగా ముందుకెళ్తుంటారు .అంతకు మించి రాజ్యాధికారమే లక్ష్యంగా ఎత్తులేసి పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు. స్వంతంగా వారి బలం ఏంటో వారికి తెలుసు కాబట్టి..వేరే పార్టీలతో పొత్తులేనిదే ఎన్నికలకు పోరు. రాజకీయాల్లో ఏమాత్రం జంకులేకుండాఎవరితోనైనా పొత్తు పెట్టుకునే శక్తి, యుక్తి చంద్రబాబుకు పుష్కలంగా ఉన్నాయి. 1995లో ఎన్టీఆర్‌ను బలవంతంగా దించి సీఎం పీఠం మీద కూర్చున్నప్పటి నుంచి చంద్రబాబు పొత్తుల్లేకుండా ఎన్నికలకు పోలేదు. మొన్న 2019లో తప్పితే.
కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్, టీఆర్‌ఎస్ ఇలా అందరితో పొత్తు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ సీపీ ఒక్కదానితోనే చంద్రబాబు పొత్తు పెట్టుకోలేదు. గత ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టిన తిట్టుతిట్టకుండా చంద్రబాబు తిట్టారు. మోదీని ప్రధాని కాకుండా చేయడానికి చేయాల్సిందంతా చేశారు. టెన్ జన్‌పథ్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రాహుల్ భుజాల మీద చేతులేసి తిరిగారు. అంతేకాదు..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి ప్రచారం చేశారు. లేస్తే..కొల్‌కతా కాళీ మమతో భేటీలు, సమావేశాలు. దేవెగౌడ, కుమారస్వామితో మంతనాలు, డీఎంకే స్టాలిన్‌తో రాత్రి చర్చలు. కేజ్రీవాల్ తో విజయవాడలో ప్రచారం చేయించారు. అది కూడా రూ.50 కోట్లు ఇచ్చి తీసుకొచ్చారని..ఓ ఇంగ్లిష్ పత్రిక రాసింది.
మోదీని హైదరాబాద్ లో అడుగు పెట్టనీయనన్నా బాబు
ఇలా ఒక్కచోట ఉండకుండా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఎందుకు ..మోదీని ప్రధాని కాకుండా చేయడానికి. అంతేకాదు. ఖబడ్దార్ మోదీ అన్నారు. ఏపీ వైపు చూస్తే సహించం అన్నారు. చంద్రబాబు అనుకూల మీడియా కూడా మోదీ వ్యతిరేక వార్తలను వండివార్చింది. గుజరాత్ ఊచకోత సమయంలో మోదీని అన్న మాటలను మరిచి..2014లో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. హైదరాబాద్‌లో మోదీని అప్పుడు అడుగు కూడా పెట్టనీయం అన్నారు. అలాంటి మోదీ వేవ్‌లో 2014 చంద్రబాబు గెలిచారు. వైఎస్ఆర్ సీపీపై కేవలం 5 లక్షల ఓట్లతో గెలిచి అధికారం చేజిక్కించుకున్నారు. తరువాత..మోదీతో కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఆ తరువాతే మొదలైంది నారా వారి రాజకీయం. నెక్ట్స్ ప్రధాని అభ్యర్థులు గడ్కరీ, రాజ్ నాథ్ అని తన అనుకూల పత్రికల్లో వచ్చేలా ప్లాన్ చేశారు. నాగపూర్ ఆర్ఎస్ఆర్ కార్యాలయం కూడా బాబు జిత్తులను కనిపెట్టి బాబులాంటి వారితో దూరంగా ఉండాలని మోదీకి సూచించిందని చెబుతారు. ఎందుకంటే..బాబుకు రాజకీయ అవసరాలే కాని..సిద్ధాంతాలు ఉండవు. ఇలా..తన వ్యతిరేక శక్తులతో కలిసి రాజకీయం చేయడాన్ని మోదీ సహించలేకపోయారు. అంతే..బాబును దూరంగా పెట్టారు.
గ్యాప్ ఎలా వచ్చింది?ఎందుకు దగ్గర అవుతున్నారు..?
చంద్రబాబు, మోదీ మధ్య గ్యాప్ వచ్చింది. ఎంతగా అంటే..మోదీని తిట్టడానికే సభలు పెట్టారు, నిరసనలు చేపట్టారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. కాని..2019 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 300పైగా స్థానాలు కైవసం చేసుకుంది. వచ్చి రావడంతోనే ట్రిపుల్ తలాఖ్ రద్దు చేశారు. దశాబ్దాలుగా రాచపుండులా ఉన్నా..ఆర్టికల్ 370ని రద్దు చేశారు. జాతీయంగా, అంతర్జాతీయంగా మోదీ పేరు మారుమోగుతుంది. మోదీ గ్రాప్ మునుపటి కంటే పెరగడం ప్రారంభించింది. ఇది గమనించిన బాబు..మోదీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మోదీకి దూరంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని అనుకుని ఉంటారు. సుజనా, సీఎం రమేష్ కూడా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే బీజేపీలోకి వెళ్లారని చెప్పుకుంటూ ఉంటారు. వీరు బీజేపీలో చేరినా వీరి వాయిస్ చంద్రబాబు మౌత్ పీస్‌లా ఉంటుంది. అందుకే..వీరిని బీజేపీలో ఉన్న చంద్రబాబు ప్రతినిధులు అంటారు.
బీజేపీలో చేరికలు వెనుక..బాబు హస్తం ఉందా?!
ఇక..ఆలస్యం విషం అనుకుంటున్నారు చంద్రబాబు. బీజేపీ నేతలకు దగ్గర కావడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులకోవడంలేదు. అక్లోబర్ 22 అమిత్ షా బర్త్ డే. చంద్రబాబు ఏమాత్రం లేట్ చేయలేదు. అమిత్ జీ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్విట్ చేశారు. అమిత్ షా కూడా థాంక్ప్ అంటూ రిప్లే ఇచ్చారు. ఇలా చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. రాష్ట్రంలో అధికారం లేదు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వమూ లేదు. అందుకే..చంద్రబాబు మరోసారి బీజేపీ దగ్గర కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. అందులో భాగంగానే టీడీపీలో నమ్మకమైన నేతలను బీజేపీలోకి పంపుతున్నారని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఆది కూడా చంద్రబాబు సూచనల మేరకే వెళ్లారని అంటున్నారు. అలా తన పార్టీని బలహీనపరుస్తూ..బీజేపీ బలోపేతానికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదంతా మోదీ, అమిత్ షాల మెప్పు కోసమే చంద్రబాబు చేస్తున్నారని టీడీపీ తమ్ముళ్లు లోలోన గుసగుసలాడుకుంటున్నారు. చూద్దాం..చంద్రబాబుకు మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ దొరుకుతుందో లేదు. అయితే..సోషల్ మీడియా మాత్రం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలపై మాత్రం పంచ్ లేస్తుంది.
�
వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్