'చందమామ' బొమ్మల తాతయ్య కన్నుమూత
By సుభాష్ Published on 30 Sept 2020 8:08 AM ISTచందమామ బొమ్మల శంకర్ తాతయ్య (97) కన్నుమూశారు. భారతీయ బొమ్మల కథలకు ప్రాణం పోసిన మహనీయుడు తన రంగుల చిత్రాలకు ముగింపు పలికారు. భారతీయులను తన బొమ్మలతో మురిపించిన శంకర్ అనారోగ్యంతో చెన్నైలో మరణించారు.1924లో తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన శంకర్ చివరి వరకు బొమ్మలే జీవితంగా గడిపారు. చందమామ పత్రిక అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో వెలుడంతో ఆయన దేశమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. భేతాళకథల బొబమ్మలు సహా ఎన్నో సీరియళ్లు, వేల కథలకు ఆయన బొమ్మలు సింగారించారు. పిల్లలను, పెద్దలు అనే తేడా లేకుండా ఆకట్టుకునే ఆయన బొమ్మలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 1941లో మద్రాస్ గవర్నమెంట్ ఫైనార్ట్స్ కాలేజీలో చేరి శిక్షణ పొందారు. నాగిరెడ్డి, చక్రపాణి ప్రారంభించిన చందమామ అతని కెరీర్‌కు బాటలు వేసింది.
1951లో చందమామలో చేరిన శివశంకరన్..60 ఏళ్ల పాటు అందులో పని చేశారు. ఈ పత్రికలో చిత్రకారుల బృందానికి శంకర్ నేతృత్వం వహించారు. 93 ఏళ్ల వయసులోనూ మ్యాగజైన్‌కు శంకర్ బొమ్మలు గీయడం విశేషం. కథల్లో వచ్చే విక్రమార్కుడు, భేతాళుడి రేఖాచిత్రం పాఠకుల మదిలో నిలిచిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు చిత్రకారులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.