చాహల్‌ బుగ్గగిల్లిన అమ్మాయి.. వీడియో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2020 2:40 PM IST
చాహల్‌ బుగ్గగిల్లిన అమ్మాయి.. వీడియో వైరల్‌

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ముప్పుతో దాదాపు అన్ని క్రీడా టోర్నీలు రద్దు అయ్యాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌, ఐపీఎల్ రద్దు కావడంతో టీమ్‌ఇండియా క్రికెటర్లు ప్రస్తుతం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని క్రికెటర్లు సహా పలువురు ఆటగాళ్లు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభణతో అంతా ఆందోళనలో ఉంటే టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ మాత్రం తాను ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. కరోనా వైరస్‌ సంక్షోభంతో సతమతవుతున్న అభిమానులకు వినోదాన్ని ఇవ్వాలనుకున్నాడో.. ఏమో కానీ తాజాగా మరొక టిక్‌టాక్‌ వీడియాతో అలరించాడు.

తాజా వీడియోలో చాహల్‌ను ఓ అమ్మాయి ఆటపట్టించి అతని బుగ్గలు గిల్లడం ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతం వినిపిస్తుండగా ఓ అమ్మాయితో చాహల్ సరదాగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతను ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుండి తన షూ లేస్‌ను సరిచేసుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి అతని వెనక్కువెళ్లి కనిపించకుండా ఆట పట్టిస్తుంది. ఇది చూసిన చాహల్.. కొడతా అన్నట్టుగా ఆమెపైకి చెయ్యెత్తుతాడు. ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూ అతని చెంప గిల్లి అక్కడి నుంచి పారిపోతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.ఈ వీడియో బాగానే ఉన్నప్పటికి ఫ్యాన్స్‌ మాత్రం వేషాలు తగ్గలేదని రిప్లై ఇస్తున్నారు. కరోనా వైరస్‌తో ఇంటికి పరిమితం కాకుండా ఇలా చేయడాన్ని తప్పుబడుతున్నారు.



Next Story