పంతం నెగ్గించుకున్న అర్వింద్‌.. సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రకటించిన కేంద్రం

By అంజి  Published on  4 Feb 2020 2:52 PM IST
పంతం నెగ్గించుకున్న అర్వింద్‌.. సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రకటించిన కేంద్రం

నిజామాబాద్‌: దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పసుపు రైతుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం పసుపు రైతులకు ఊరట కలిగేలా సుగంధ ద్రవ్యాల బోర్డుపై ప్రకటన చేసింది. నిజామాబాద్‌ కేంద్రంగా మసాల దినుసులు, సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. పసుపు పంట ఎగుమతులపై ఈ బోర్డు పని చేయనుంది. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రస్తుతమున్న డివిజనల్‌ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచుతున్నట్లు పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఐఏఎస్‌ హోదా ఉన్న అధికారి పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయ డైరెక్టర్‌గా ఉంటారు. ప్రాంతీయ కార్యాలయం నుండే ఇక్కడి కార్యాకలాపాలపై నేరుగా కేంద్రమంత్రిత్వశాఖకు నివేదికలు ఇవ్వనున్నారు. పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకునే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. దీనిపై అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ప‌లుమార్లు ప్ర‌క‌టించిన‌ట్లుగా.. త్వ‌ర‌లోనే ప‌సుపు రైతులు సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు విష‌యంలో శుభ‌వార్త వింటారని తెలిపిన‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనతో గత ఎన్నికలకు ముందు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇచ్చిన హామీని నేరవేర్చుకున్నట్లుయ్యింది. పసుపు బోర్డు ఏర్పాటుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. ద‌శాబ్దాలుగా పసుపు రైతులు బోర్డు ఏర్పాటు చేయాలని, మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఈ విషయమై పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులు తమకు కూడా రాయితీలు, ప్రొత్సహకాలు అందుతాయనే భావనలో ఉన్నారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధరలు ఉన్నా పసుపుకు మాత్రం మద్ధతు ధర లేదు. పసుపు సుగంధ ద్రవ్యాలలో ఉండడం చేత‌నే దీనికి మద్ధతు ధర లేదు. వ్యాపారులే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుండ‌టంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఈ నేఫ‌థ్యంలో కేంద్రం ప‌సుపు రైతుల ప‌ట్ల అన‌కూల నిర్ణ‌యం తీసుకోవడం శుభ‌ప‌రిణామంగా భావించ‌వ‌చ్చు.

Next Story