మరో ఇటలీ, అమెరికాగా భారత్..
By రాణి Published on 31 March 2020 6:27 PM IST
భారతదేశాన్ని పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్..విదేశాల నుంచి వచ్చినవారు, వారితో కలిసి తిరిగిన వారి వివరాలను వేగంగా సేకరిస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయన్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 227 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1440కి చేరిందని తెలిపారు. మృతుల సంఖ్య 47కు పెరిగిందన్నారు.
Also Read : దేశమంతా లాక్ డౌన్..కరోనా బ్రేక్ డౌన్
మరోవైపు కరోనా నియంత్రణ కోసం అవసరమైన శానిటైజర్లు, మాస్కులు, వైద్యపరికరాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు ఆన్ లైన్ లో 15000 మంది నర్సులకు ప్రత్యేక శిక్షణనిస్తున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే ప్రజలు కూడా ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు పాటించి సహకరిస్తేనే కరోనావైరస్ ను అరికట్టగలమని, లేకపోతే దేశంలో జరిగే ప్రాణనష్టాన్ని అంచనా వేయలేమన్నారు. దయచేసి ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read : గ్యాస్ ట్రబుల్ ఉందా ? ఇంట్లోనే ఇవి ట్రై చేయండి
దేశంలో మార్చి 1వ తేదీన 3 కేసులే ఉంటే..31వ తేదీకి 1440కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 1న 80,000 కేసులుంటే 31 నాటికి 8 లక్షలకు పెరిగిందన్నారు. అంటే విదేశాల్లో కరోనా వ్యాప్తి ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంతే ఫాస్ట్ గా వైరస్ వ్యాప్తి జరిగితే గనుక వచ్చే నెలరోజుల్లోపే భారత్ లో కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరవచ్చని లవ్ అగర్వాల్ ఆందోళన చెందారు. సామాజిక వ్యాప్తిని అరికట్టకపోతే భారత్ మరో ఇటలీ, అమెరికాలా మారే ప్రమాదముందన్నారు.