ఇన్‌కంట్యాక్స్‌ కమిషన్‌, ఏపీ ఆర్థిక మండలి సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ విషయంలో జగన్‌ సర్కార్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. కృష్ణకిశోర్‌కు పెండింగ్‌లో ఉన్న వేతనాలను రెండు వారాల్లో చెల్లించాలని తాము ఆదేశాలిచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. ఈ విషయమై గత నెల 24వ తేదీన ఆదేశాలు జారీ చేసినా.. జాప్యం ఎందుకు చేస్తున్నారో తెలుపాలని సూచించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇస్తూ అపిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు క్యాట్‌ చైర్మన్ జస్టిస్‌ లింగాల నరసింహారెడ్డి, సభ్యులు సుధాకర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తనను సస్పండ్‌ చేయడంతో పాటు ఏసీబీ, సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవా చేస్తూ కృష్ణ కిశోర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మరోసారి ధర్మాసనం విచారణ జరిపింది. ఇక కృష్ణకిశోర్‌ తరపున న్యాయవాది నీరజ్‌ మల్హోత్రా వాదిస్తూ రెండు వారాల్లో పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని గత రూలింగ్‌ సందర్భంగా ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వేతనాలు ఇవ్వకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తామని ఏపీ సర్కార్‌ తరపున న్యాయవాది ప్రకాశ్‌రెడ్డికి ధర్మాసనం స్పష్టిం చేసింది.

కాగా, పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించామని న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి ధర్మసనానికి చెప్పుకొచ్చారు. ఆరు వారాలుగా మా ఆదేశాలు బేఖతర్‌ చేశారు. సీఎస్‌ హాజరుకు ఆదేశిస్తామనగానే ప్రభుత్వం రెండు గంటల్లో వేతనాలు చెల్లించడం సాధ్యమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు.. అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఆదాయపన్నుశాఖకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి

కృష్ణకిశోర్‌ డిప్యూటేషన్‌ రద్దు చేసి మాతృసంస్థ ఆదాయపన్ను శాఖకు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాది కోరారు. ఇప్పటికే ప్రిన్సిపల్‌ కమిషన్‌గా పదోన్నతి వచ్చిందని, ఆయన బ్యాచ్‌కు చెందిన అధికారులంతా డ్యూటీల్లో చేరిపోయారని ధర్మసనానికి వివరించారు. అయితే ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం గురువారమే నన్ను నియమించుకుందని, కేసు వివరాలు పరిశీలించేందుకు కొంత సమయం కావాలని, ఈ విచారణను వారం రోజుల పాటు వాయిదా వేయాలని న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి కోరారు. దీనికి నీరజ్‌ మల్హోత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదు వారాల కిందట ధర్మాసనం ఆదేశాలు ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించినా. కేసు విచారణకు వచ్చే ఒకరోజు ముందు సీనియర్‌ న్యాయవాదిని నియమించిందని, దీని బట్టి చేస్తూ ఇదంతా కేసు విచారణను జాప్యం చేయడానికేనని తెలిసిపోతుందని ఆరోపించారు. కాగా, డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారి తిరిగి మాతృసంస్థకు పంపించాలని కోరినా.. ఇక్కడే ఉండాలంటూ ఎటువంటి పని లేకుండా ఖాళీగా కూర్చోబెట్టడం సరికాదని కోర్టు వ్యాఖ్యనించింది. తదుపరి విచారణ ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.